
* ఓరుగల్లు సభతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్
* మళ్లీ కనిపించిన ఉద్యమ కేసీఆర్
* రాష్ట్రానికి కాంగ్రెస్ ను విలన్ చేసి.. తాను హీరోనని చెప్పకనే చెప్పి..
* సభ అనంతరం మొదలైన కొత్త తరహా చర్చలు
* ఉద్యమ పార్టీ మళ్లీ వెలుగొందేలా వ్యూహాత్మకంగా ప్రసంగం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
“ఇగ చూస్సిర్రా మా గవర్నమెంట్‌ను పడగొడుతరంట.. మేం ఎందుకు పడగొడుతాం రా బాయ్.. మాకేమన్న కాళ్లు చేతులు గులగుల పెట్టినయా.. మేం ఆ కిరికిరి పని చేయం. బిడ్డా మీరు ఉండాలే.. ఓట్లు తీసుకున్నారు. సక్కగ పని చేయకపోతే మీ వీపులు ప్రజలే సాప్ చేస్తరు…” అని హెచ్చరించినా..
“అవివేకం, అజ్ఞానం వల్ల పరిపాలన చేయడం రాక ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు. సర్వనాశనం చేశారు. ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగా ఉండే.. ఇవాళ తెలంగాణను చూసి నా మనసు బాధ అయితుంది. ఇబ్బంది అవుతుంది.. తెలంగాణ నా కళ్ల ముందు ఇలా కావడం నాకు దుఃఖం కలిగిస్తుంది..” అని ఆవేదన వ్యక్తం చేసినా..
“మొగోడు అని మొలక అలికేందుకు పిలిస్తే.. ఎలుక పిల్లను చూసి ఎల్లెలకల పడ్డట…” అని సెటైర్లు వేసినా..
“ఉచిత బస్సు అని పెడితే జుట్లు పట్టుకుని కొట్టుకునేందుకు పనికి వస్తుంది తప్ప ఉపయోగం లేదు. ఈ ఉచిత బస్సు మాకు అవసరం లేదు అని ఆడబిడ్డలు అంటున్నారు..” అంటూ కాంగ్రెస్ పథకాలను ఎద్దేవా చేసినా.. అది కేసీఆర్‌కే చెల్లుతుంది. అవును.. మరోసారి కేసీఆర్ తన వాగ్దాటితో ప్రత్యర్థి పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగట్టారు. తెలంగాణకు ఏం బీమారి వచ్చిందంటూ.. కాంగ్రెస్ కు బీమారి వచ్చేలా చేశారనే చర్చ జరిగేలా చేశారు. మరోసారి తెలంగాణ వాదాన్ని తెరపైకి తెచ్చి ఆకట్టుకున్నారు. ఉమ్మడి వరంగల్ లో జరిగిన బీఆర్ ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుక వేదికగా కేసీఆర్ మరోసారి తానేంటో నిరూపించారు.
అది కదా కేసీఆర్!
గులాబీ బాస్ కేసీఆర్ గురించి తెలంగాణ సమాజానికి తెలియనిది కాదు.. అయినా అధికారం కోల్పోయిన ఈ కొద్ది నెలల్లోనే ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో ఇక ఆయన పనైపోయిందని అన్నారు. భయపడి అసెంబ్లీకి రావడం లేదని చాలా మంది ఎద్దేవా చేశారు. అయినా ఇప్పటి వరకు కేసీఆర్ అంతగా రియాక్ట్ కాలేదు. ఫాంహౌస్‌లో వ్యవసాయం చేస్తూ కూర్చున్నారు. దీంతో కొంత మంది నిజమే అనుకుని పక్క చూపులు చూశారు. తాజాగా ఓరుగల్లు సభకు అధిక సంఖ్యలో జనం తరలిరావడం, కేసీఆర్ ప్రసంగానికి చప్పట్లు హోరెత్తడం చూసి.. ఆనాటి కేసీఆర్ మళ్లీ “నిద్ర”లేస్తే.. ఇట్లుంటది అన్న చర్చ జరిగేలా చేశారు. “ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇకపై ఓ లెక్క” అంటూ ఇప్పటి వరకు మౌనంగా ఉన్న కేసీఆర్ ఈ సభ ద్వారా గర్జించడంతో అది కదా కేసీఆర్ అని గులాబీ శిబిరాలు ఉత్సాహంగా ఉన్నాయి.
ఆ మూడక్షరాలే చాలు..
ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ ఎస్ (టీఆర్ ఎస్).. 14 ఏళ్లు ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఆ తరువాత 2014లో తెలంగాణలో అధికారం చేపట్టి సుమారు 10ఏళ్లు పాలించింది. అయితే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చుకుని 2023 నవంబరులో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి తేరుకోకముందే 2024 మే 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గులాబీ పార్టీ గెలుచుకోలేదు. దీంతో బీఆర్ఎస్ క్యాడర్ తీవ్ర నిరాశకు గురైంది. ఆ తరువాత వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమిని ఎదుర్కొవాల్సి వచ్చింది. గత మార్చిలో జరిగిన వరంగల్, నల్లగొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండటం గులాబీ శ్రేణులను మరింత నైరాశ్యంలోకి నెట్టింది. అయితే తాజాగా వరంగల్ సభ అనంతరం.. కేసీఆర్ అన్న మూడు అక్షరాలు ఉండగా.. బీఆర్ ఎస్ ఎప్పుడూ జవసత్వాలు కోల్పోదనే చర్చ మొదలైంది. ఈ సభలో కేసీఆర్ ప్రసంగం విన్న వాళ్లు, చూసిన వాళ్లు మళ్లీ ఉద్యమకాలం నాటి కేసీఆర్ ను చూశామని చెబుతున్నారు.
కాంగ్రెస్ విలన్.. కేసీఆర్ హీరో..
ఈ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ఏకంగా తెలంగాణాకు విలన్ ను చేసేశారు. అవును.. నిజమే అన్నట్లుగా ప్రజల్లో చర్చ జరిగేలా ఆకట్టుకునే ప్రసంగం చేశారు. “ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీయేనని ఉదాహరణలు పేర్కొన్న తీరు ఆయనలోని సీనియర్ రాజకీయ నాయకుడిని మరోసారి తెరపైకి తెచ్చింది. ఆనాడైనా, ఏనాడైనా.. ఈనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు.. ప్రజలు వద్దంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వారే కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపింది ఇందిరా గాంధీ ప్రభుత్వం. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. 2001 నుంచి విజృంభిస్తే.. నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి.. మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తుపెట్టుకొని తెలంగాణ ఇస్తమని నమ్మబలికి మీరు చూశారు. మళ్లీ ఎగొట్టే ప్రయత్నం చేశారు. వారి మోసాన్ని కప్పేయడానికి నేను.. జయశంకర్ సార్‌తో కలిసి పార్లమెంట్లో ప్రతిపక్షాలు కాంగ్రెస్ గొంతుపట్టుకుంటే.. అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. మళ్లీ ప్రకటన వెనక్కి తీసుకొని.. మళ్లీ వెనక్కి వెళ్లారు.’”
అని వివరించడం ద్వారా అవును.. నిజమే కాంగ్రెస్ తెలంగాణకు విలనే అన్న ఆలోచనలు మొదలయ్యేలా చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు.. “వలసవాదుల విష కౌగిలో ఉన్న నా భూమికి విముక్తి కలిగించడానికి ఒక్కడినే బయలు దేరా. ఆ సమయంలో ఎంతో మంది వెటకారం చేశారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కొట్లాడి తెలంగాణ సాధించా..” అని ఉద్యమ కాలంనాటి అంశాలను తెరపైకి తెచ్చి తాను హీరోనని నిరూపించుకునే ప్రయత్నం చేశారు.
ఉద్యమ పార్టీ మళ్లీ వెలుగొందేలా..
అటు కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతూ, హైడ్రా కూల్చివేతల నుంచి.. అధికార పార్టీ విమర్శలు ఎదుర్కొంటున్న అన్ని అంశాలను లేవనెత్తుతూ కేసీఆర్ తనదైన శైలిలో సభను రక్తి కట్టించారు. “మీ డైరీల్లో రాసి పెట్టుకోండి.. మళ్లీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బరాబర్ బీఆర్ ఎస్” అని .. పార్టీ శ్రేణుల్లో తీవ్ర జోష్ నింపారు. అధికార పార్టీలో వణుకు పుట్టించారు. “కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాదిన్నర అయింది.. ఏ మాయం రోగం వచ్చే.. ఏం బీమారి వచ్చే.. ఏమేమి చెప్పిరి.. ఎన్నెన్ని చెప్పిరి.. ఏమేమి మాటలు మాట్లాడిండ్రు. వరుసబట్టి గోల్ మాల్ దింపుట్ల, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్‌ను మించినోడు లేరు. ఇక్కడ ఉన్నోళ్లు చాలరని చెప్పి ఉన్న గాంధీలు, లేని గాంధీలు, డూప్లికేట్ గాంధీలు ఢిల్లీకెళ్లి దిగారు. స్టేజీల మీద డ్యాన్స్‌లు చేశారు” అని అధికారంలోకి వచ్చాక, రాక ముందు కూడా కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు, నేతల తీరుపై విభిన్న తరహాలో విమర్శలు గుప్పించడం ద్వారా దటీజ్ కేసీఆర్ అని.. తుంగతుర్తి సభ నిరూపించుకున్నారు. ఉద్యమ పార్టీ మళ్లీ వెలుగొందేలా వరంగల్ నుంచి బాటలు వేశారని గులాబీ నేతలు జోష్‌లో ఉన్నారు. అయితే ఇకపై జనాల్లో ఉంటానన్న కెసిఆర్.. మాట మీద నిలబడతారా, ప్రతిపక్ష నాయకుడిగా అయన నిత్యం ప్రజాక్షేత్రం లో ఉంటే రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.
……………………………………………………..