
– టిపిసిసి ఉపాధ్యక్షుడు,ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
ఆకేరు న్యూస్, హుజూరాబాద్ : హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా పరిష్కరిస్తామని టిపిసిసి ఉపాధ్యక్షుడు బల్మూరి వెంకట్ అన్నారు. శుక్రవారం హుజరాబాద్లో నిర్వహించిన చాకలి ఐలమ్మ 130 వ జయంతి ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో అవకతవకలు,అక్రమాలు జరిగాయని వాటన్నిటి పైన న్యాయ విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ – కార్ రేసింగ్ లో కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం అని అన్నారు.హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేసిందన్నారు. నిధుల మంజూరు పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి, స్థానిక ఎమ్మెల్యే సిగ్గు శరం లేకుండా తన పోరాటం వల్లే నిధులు వచ్చాయని చెప్పుకోవడం హాస్యస్పదంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబం కోసం కొట్లాడటం ఆపి, ప్రజల సమస్యల్ని పట్టించుకోవాలని హితవు పలికారు.
……………………………………………