
– ప్రతి గ్రామంలో కనీసం 200 మంది కూలీలకు ఉపాధి హామీ పని కల్పించాలి
– ఉపాధి హామీ పని ఉదయం 6 గంటలకే ప్రారంభించాలి
– అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : ప్రతి గ్రామంలో ఉపాధి హామీ సిబ్బంది ఆ గ్రామానికి పని రోజులను నిర్దేశించిన విధంగా కల్పించాలని లేనిచో ఆయా ఉద్యోగులపై చర్యలు తప్పవని అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు అన్నారు. మంగళవారం మండలంలోని వంగపల్లిలో ఉపాధి హామీ పథకంతో నిర్మిస్తున్న చేపల చెరువును,ఎంపీడీవో గుండె బాబుతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామపంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు.ఎండాకాలం దృష్ట్యా ఉపాధి హామీ పనులను ఉదయం 6కే ప్రారంభించాలని, గ్రామాల్లో కనీసం 200 మంది కూలీలకు ఉపాధి హామీ పని కల్పించాలనీ,పని ప్రదేశంలో తాగునీరు, నీడ, ప్రధమ చికిత్స సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ,ఉపాధి హామీ కూలీలకు 307 రూపాయలు కొలతల ప్రకారం పని చేసే విధంగా కొలతలపై అవగాహన కలిగించాలని అన్నారు. అదే విధంగా ప్రతి గ్రామంలో వ్యక్తిగత ఇంకుడు గుంత,మరుగుదొడ్డి,ప్రభుత్వ భవనాలకు వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణం,ప్రతి బోరుబావికి రీఛార్జ్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. కార్యక్రమంలో ఉపాధి హామీ డిటిసి శ్రీధర్,ఏపీ ఓ రమేష్, ఈ సి కార్తీక్, టీ ఏ మానస, పంచాయతీ కార్యదర్శి విద్యాసాగర్ రెడ్డి, రాజకుమార్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
………………………………………………….