* ప్రాణాలూ తీసేందుకూ ఆలోచించని కొందరు కేటుగాళ్లు
* పని మనుషుల ఎంపికలో అప్రమత్తం
* కేర్ టేకర్ ఏజెన్సీల్లోనూ కంత్రీగాళ్లు
* పోలీసుల సూచనలను పాటించడమే మంచిది
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
తెలంగాణ రాజధాని కూకట్‌పల్లిలో స్టీల్ ట్రేడర్స్ యజమాని భార్య రేణు అగర్వాల్ దారుణ హత్యను ఇప్పటికీ చాలా మంది మరచిపోలేరు. పనివాళ్ల ముసుగులో ఇంట్లో చేరిన కేటుగాళ్లు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. పనిలో చేరిన పదిరోజులకే అసలు నైజాన్ని బయటపెట్టారు. ఇంట్లోని నగలు, నగదు దోచుకోవడానికి కుట్ర పన్నారు. వాటి కోసం యజమానురాలు రేణు అగర్వాల్‌ను తీవ్రమైన చిత్రహింసలకు గురి చేశారు. కాళ్లు, చేతులు కట్టేశారు. బంగారం, నగదు ఎక్కడుందో చెప్పాలని కొట్టారు. ఆమె ఎంతకీ నోరు విప్పకపోవడంతో కోపంలో కుక్కర్‌తో తలపై మోది, కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పనివాళ్ల ముసుగులో కొన్ని మృగాలు కూడా ఇళ్లలోకి వస్తున్నాయన్న చర్చ జరిగింది.
వెంటాడుతున్న భయం
రేణు అగర్వాల్ హత్య తాలూకు భయం ఇప్పటికీ నగరవాసులను వెంటాడుతూనే ఉంది. ఎవరినైనా పనిలో పెట్టుకోవాలంటే ఆలోచించాల్సి వస్తోంది. మంచివాళ్లను కూడా అనుమానించాల్సి వస్తోంది. కొందరు కేటుగాళ్లు దోచుకోవడమే లక్ష్యంగా ఇంట్లో పనివాళ్లుగా, కేర్టేకర్లుగా, డ్రైవర్లుగా చేరుతున్నారు. కొంతకాలం యజమానులు చెప్పినట్లు నడుచుకొని, అతి మంచితనాన్ని ప్రదర్శిస్తున్నారు. సొంతవాళ్లనే విధంగా యజమానుల మెప్పు పొందుతున్నారు. డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులు ఉన్న గదుల్లోకి వెళ్లేంత చనువు పొందుతున్నారు. అదును చూసి ఇంట్లో ఉన్న వృద్ధులను కట్టేసి, మత్తుమందు కలిపిన భోజనం పెట్టి, లేదంటే దారుణంగా హత్య చేసో సొత్తుతో దోచుకుని ఉడాయిస్తున్నారు.
గతంలోనూ ఘోరాలు
కూకట్పల్లి ఘటనే కాదు.. గతంలో దోమలగూడ పరిధిలో ఓ ఇంట్లో పనికి చేరిన నేపాల్ దొంగలు నెలరోజుల్లోనే దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న వృద్ధులకు భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చి, సుమారు రూ. కోటిన్నర విలువైన బంగారం, డబ్బు దోచుకొని ఉడాయించారు. ఆ దొంగలు ఇప్పటికీ దొరకలేదు. బతుకుదెరువుకోసం నగరానికి వచ్చిన వ్యక్తి ఓ బంగారం దుకాణంలో పనిలో చేరాడు. చేరిన నాలుగు రోజులకే యజమానికి టోకరా వేసి రూ. 30లక్షలతో చెక్కేశాడు. పనిలో చేరిన మరుసటి రోజే 150 తులాల బంగారం, వజ్రాభరణాలతో ఉడాయించిన ఘటన గతంలో ఎస్ఆర్నగర్లో జరిగింది. ఇంటి యజమానులు పనిమీద బయటకు వెళ్లగానే భావించి పనిమనిషి ఇంట్లో ఉన్న వృద్ధుల కళ్లలో కారం చల్లి బంగారు నగలతో పరారయ్యారు.
పోలీసులు ఏం చెబుతున్నారంటే..
వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు నగరవాసులను అప్రమత్తం చేసే చర్యలకు శ్రీకారం చుట్టారు. అవగాహన కల్పిస్తున్నారు. ఏజెన్సీల ద్వారా కాకుండా తెలిసిన వ్యక్తుల ద్వారా పనివాళ్లను ఎంపిక చేసుకోవాలని, వారి చిరునామా, ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ లాంటి గుర్తింపు కార్డులను పరిశీలించాలని, వాటిని కాపీలు తీసుకోవాలని చెబుతున్నారు. తమను సంప్రదిస్తే విచారణ జరిపి వారి అసలు వివరాలను కనుక్కుంటామని భరోసా కూడా ఇస్తున్నారు. డ్రైవర్ల ముందు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు మాట్లాడకపోవడం మంచిదని సూచిస్తున్నారు. బ్యాంకు పనులు, ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పనులు అప్పగించకపోవడమే మంచిదని అంటున్నారు.
…………………………………………………..
