
* అగ్రరాజ్యంలో కఠిన నిబంధనలు
* గతంలో పెట్టీ కేసులు.. ఇప్పుడు సీరియస్‌గా పరిగణన
* ట్రంప్ సర్కారు వచ్చాక విద్యార్థులకు కొత్త కష్టాలు
* అమెరికా పరిణామాలపై తల్లిదండ్రుల్లో ఆందోళన
* జాగ్రత్త బిడ్డా అంటూ పిల్లలకు ఫోన్లు
* 6000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక.. కొత్త కొత్త నిబంధనలతో ఇతర దేశస్థులను హడలెత్తిస్తున్నారు. ట్రంప్ స్వదేశీ అభిమానం ఇతరులకు శాపంగా మారుతోంది. తాత్కాలిక, విద్యార్థి వీసాలపై యూఎస్‌లో నివసిస్తున్న వారి కోసం ఇప్పటికే కొత్త నిబంధనలు తీసుకు వచ్చారు. ఈ దెబ్బకు భారతీయ విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేయడం మానేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రంప్ వచ్చాక.. చాలా మంది వీసాలు తిరస్కరణలకు గురవుతున్నాయి. ట్రంప్ “అమెరికా ఫస్ట్” విధానాన్ని మొదలు పెట్టిన నాటి నుంచీ విదేశీ టెకీలకు ప్రధానంగా భారత్ ఉద్యోగులకు అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. దీని కారణంగా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగాలను అమెరికన్లకే ప్రాధాన్యతనిస్తూ, భారతీయ ఉద్యోగుల నియామకాన్ని తగ్గించాలనే దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. దీనివల్ల ఐటీ రంగంలో ఉద్యోగాల కోతలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరం కావడం, అమెరికా ఆర్థిక వ్యవస్థలో మార్పులు, కంపెనీల పునర్వ్యవస్థీకరణ వంటివి ఉద్యోగాల కోతలకు దోహదం చేస్తున్నాయి.
తెలుగు యువతకు కొత్త కష్టాలు
చదువు కోసం అగ్రరాజ్యం వెళ్లిన విద్యార్థులకు కూడా కష్టాలు తప్పడం లేదు. ప్రధానంగా చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునేవారికి ఇబ్బందులు తలెత్తాయి. ట్రంప్ వచ్చాక అమెరికాలో స్టూడెంట్స్ కష్టాలు మామూలుగా లేవు. ముఖ్యంగా తెలుగు వారు అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ పరిస్థితి చాలా ఆగమ్యగోచరంగా కనిపిస్తోంది. ట్రంప్ రాకతో పార్ట్ టైం జాబ్స్ వదిలేశారు స్టూడెంట్స్. ఇప్పుడు వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం అని చెప్పుకోవాలి. ఆదాయం లేకపోవడంతో పిల్లలే ఉల్టా మమ్మల్ని డబ్బులు అడుగుతున్నట్లు హైదరాబాద్ కు చెందిన జన్ను రమేష్ వాపోయారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కలలతో వెళ్ళిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వారిలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అమెరికాలోని ఏదో యూనివర్సిటీలో సీటు పట్టి అక్కడికి వెళ్లి పార్ట్ టైం జాబ్ చేస్తూ .. లోన్స్ తీర్చుకుంటూ.. ఉన్నారు. తమ కోసం పాకెట్ మనీ సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్లందరూ బిడియం బిడియంగా గడుపుతున్నారు.
నేరారోపణలు ఉంటే ఇంటికే..
అలాగే ఇటీవల విదేశీ విద్యార్థులపై అమెరికా కఠిన చర్యలకు సిద్ధమైంది. 6000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. నేర సంబంధిత ఆరోపణలతో 4వేల వీసాలు రద్దు చేశారు. మరో 200 నుంచి 300 వీసాలను టెర్రరిస్టు గ్రూపులు ఇస్తున్నారన్నా ఆరోపణలతో రద్దు చేశారు. దాదాపు 29 శాతం మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. వారిలో 3000 మందికి పైగా భారతీయులు మాత్రమే డీపోర్టు అవుతున్నారు. నేర ఆరోపణలు.. దాడి.. దొంగతనమే కాదు వాటిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. డ్రంకెన్ డ్రైవ్ లాంటి కేసులను గతంలో పెట్టీ కేసులుగా నమోదు చేసేవారని అక్కడున్న కొందరు పేర్కొంటున్నారు. ఇప్పుడు వాటిని సీరియస్ కేసులుగా పరిగణించి వీసా రద్దు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు సైతం..
ఈ తరహా కేసుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు కూడా డీపోర్టేషన్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. డ్రంకెన్ డ్రైవ్ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చాలా మందే ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఈ డ్రైవ్ ను ఇలాగే కొనసాగిస్తే దాదాపు 23వేల మంది విద్యార్థుల వీసాలు రద్దయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో ఇవన్నీ పెట్టీ కేసులుగా చూపించేవారు. సోషల్ ప్రొఫైల్స్ పై కూడా ట్రంప్ సర్కారు నిఘా పెట్టింది. తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ లాగ తాగి తందనాలు చేయవద్దని, జాగ్రత్తగా మసులుకోవాలని తమ పిల్లలకు కొందరు తల్లి దండ్రులు ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నారు. చాలా అప్పులు చేసి పంపించామని, చేయకూడని పనులు చేసి ఇబ్బందులు తెచ్చుకుంటే కుటుంబమంతా కష్టాలు పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.
…………………………………………..