* ప్రతి నిమిషానికీ ఐదుగురు..
* ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు
* ఆ రెండు దేశాల్లోనే ఎక్కువ మంది బాధితులు
* కొత్త కేసుల వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
* ఇప్పట్లో పూర్తిస్థాయిలో చికిత్స, మెడిసిన్ కష్టమే
ఆకేరు న్యూస్ డెస్క్ :
ప్రపంచవ్యాప్తంగా ఏటా 25 లక్షల మంది.. అంటే గంటకు 278 మంది.. ఈ లెక్కన ప్రతి నిమిషానికీ ఐదుగురు.. ఏంటీ ఈ గణాంకాలన్నీ అనుకుంటున్నారా? లైంగిక వ్యాధులతో చనిపోతున్న ప్రజల సంఖ్య. ఇది ఆందోళన కలిగించే విషయమే అయినా.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక వెల్లడిస్తున్న వాస్తవాలివి. ప్రపంచవ్యాప్తంగా లైంగిక వ్యాధుల సంక్రమణ కేసులు (సెక్స్ వల్లీ ట్రాన్స్ మిటెడ్ ఇన్ఫెక్షన్స్) పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. హెచ్ఐవీ, వైరల్ హెపటైటిస్, సిఫిలిస్, గనేరియా, క్లామిడియా, ట్రైకోమోనియాసిస్ వంటి అంటు వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొంటోంది. అప్రమత్తత లేకుంటే పెనుముప్పు తప్పదంటోంది. అంతేకాదు.. ఈ వ్యాధులకు పూర్తిస్థాయిలో మెడిసిన్ అందుబాటులోకి వచ్చేందుకు ఆరేళ్ల సమయం పడుతుందట.
అమెరికా, ఆఫ్రికాలోనే ఎక్కువ మంది బాధితులు
లైంగిక వ్యాధుల కేసుల పెరుగుదల భారతదేశంలో తక్కువేనని, అమెరికా, ఆఫ్రికాలోనే ఎక్కువగా ఉన్నదని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ముఖ్యంగా ట్రెపోనెమా పాలిడమ్ బ్యాక్టీరియా వల్ల సోకే సిఫిలిస్ వేగంగా వ్యాప్తి చెందడం వల్లే ఈ దుస్థితి అని పేర్కొంది. ఇన్ఫెక్షన్ ఉన్న సూదులు, ఇంజక్షన్ల వల్ల కూడా ఈ బ్యాక్టీరియా సోకే ప్రమాదం ఉంది. గర్భం ధరించిన మహిళకు సిఫిలిస్ సోకితే కడుపులోని బిడ్డకు కూడా అది వ్యాపిస్తుంది. ఎక్కువ కాలం పాటు దీనికి చికిత్స చేయించకపోతే.. ఇతర అవయవాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయట. కాబట్టి సిఫిలిస్ సోకితే కనిపించే లక్షణాల గురించి అవగాహన పెంచుకోవాలని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రియేసస్ సూచించారు.
అప్పటి వరకూ పూర్తి స్థాయి చికిత్స కష్టమే
లైంగిక వ్యాధుల సంక్రమణ కేసులకు ప్రస్తుతం పూర్తి స్థాయిలో చికిత్స లేదు. మందులూ అందుబాటులో లేవు. తాత్కాలిక నివారణ చర్యలు మినహా పూర్తిగా అదుపులోకి తేవాలంటే మరో ఆరేళ్లు పడుతుందట. 2030 నాటికి లైంగిక వ్యాధుల ఇన్ఫెక్షన్ కేసులకు మందులు, చికిత్స పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ ఓ పేర్కొంటోంది. సిఫిలిస్, గనేరియా, క్లామిడియా, ట్రైకోమోనియాసిస్ వంటి వ్యాధుల వల్లే రోజూ 10 లక్షల కొత్త ఇన్ఫెక్షన్లు వస్తున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది.
పెరుగుతున్న మరణాలు
2019లో వైరల్ హెపటైటిస్ వల్ల 11 లక్షల మంది చనిపోగా.. 2022 నాటికి ఈ సంఖ్య 13 లక్షలకు పెరిగింది. వీరిలో 11 లక్షల మంది హెపటైటిస్ బీ వల్లే చనిపోయారని డబ్ల్యూహెచ్ ఓ పేర్కొంటోంది. అయితే, హెచ్ఐవీ పై అవగాహనపెరగడంతో ఆ కేసులు, మరణాలు మాత్రం క్రమంగా తగ్గుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ నివేదిక తెలిపింది. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. హెచ్ఐవీ బాధితులుగా మారుతున్న వారిలో 13 శాతం మంది 15 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలే కావడం. దీన్నిబట్టి పిల్లల్లో హెచ్ ఐవీ పట్ల అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందనే విషయం అర్థం అవుతోంది.
—————————