
* ములుగు కలెక్టర్ దివాకర టిఎస్
ఆకేరున్యూస్, ములుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో రైతులకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు. శనివారం కన్నాయి గూడెం మండల కేంద్రంలోని రైతువేదికలో భూభారతి నూతన చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భూభారతి చట్టంపై, అందులో పొందుపర్చిన అంశాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఆనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని తెచ్చిందని వివరించారు. భూమి హక్కుల భద్రత, భూ సమస్యల సత్వర పరిష్కారం, రైతుల మేలు కోసం చారిత్రక మార్పు దిశగా ఈ నూతన ఆర్ఓఆర్ చట్టం ఉపకరిస్తుందని, రైతుల భూములకు భరోసా కల్పిస్తుందని సూచించారు. భూ సమస్యలు కలిగిన రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని నాలుగు మండలాలలో దీనిని ఈ నెలాఖరు వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి వచ్చే ఇతర ఏవైనా అంశాలు, సమస్యలను కూడా పరిశీలించి ఈ చట్టంలో చేర్చడం జరుగుతుందని తెలిపారు. నిర్ణీత కాల వ్యవధిలోపు వాటిని పరిష్కరిస్తారని అన్నారు. తమకు న్యాయం జరగలేదని భావిస్తే రైతులు ఆర్డీఓకు, అనంతరం కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని, ల్యాండ్ ట్రిబ్యునల్ లో కూడా అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ చట్టం ప్రవేశపెట్టిన ఏడాది కాలం లోపు భూ సంబంధిత సమస్యలపై అర్జీలు పెట్టుకునే అవకాశం కల్పించారని వివరించారు. ఆన్లైన్లో భూ భారతి పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల వ్యవస్థ ఉంటుందని, ఈ చట్టం ద్వారా రైతులకు వారి భూముల వివరాలతో కూడిన భూధార్ కార్డులను కేటాయిస్తారని తెలిపారు. భూ సమస్యలు తెలుసుకుని సులభతరంగా పరిష్కరించేందుకు భూభారతి చట్టం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర, మిగితా అన్ని రకాల భూముల రికార్డులు రెవెన్యూ కార్యాలయంలో నమోదు అయి ఉంటాయని అన్నారు. ఇదివరకటి ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ఇప్పుడు రికార్డుల నిర్వహణ ఉంటుందని, గతంలో ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే అప్పిల్ వ్యవస్థ లేదని సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిలలో అప్పీల్ వ్యవస్థ ఉందని, ప్రతి అంశం భూభారతి పోర్టల్ లో ఉంటుందని, ఎవరైనా వారి భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. సాదాబైనామా దరఖాస్తుల క్రమబద్ధీకరణకు సంబంధించి కూడా త్వరలోనే ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయనుందని తెలిపారు.
…………………………………………