* పిల్లలను అనాథలను చేయకండి
ఆకేరు న్యూస్, డెస్క్: క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు నిండు ప్రాణాలను బలిగొనడమే కాకుండా, పసిపిల్లలను అనాథలుగా మార్చి వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయి. ఇలాంటి ఘటనల్లో నిందితులకు శిక్షలు పడుతున్నా, కౌన్సిలింగ్ లాంటివి నిర్వహిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఆస్తులు, అనుమానం, అదనపు కట్నం ఇలా అనేక కారణాలతో చోటుచేసుకుంటున్న అత్యంత దారుణమైన ఘటనలు ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగి పోతున్నాయి. కళ్లముందే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు తీవ్రమైన మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పెద్దాపురం గ్రామంలో భార్యను భర్త గొడ్డలితో పాశవికంగా హత్యచేయడం సంచలనం రేపింది. భార్య తనకు మరుగు మందు పెడుతుందనే అనుమానంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మూడు నెలలుగా పుట్టింటి వద్దే ఉంటున్న భార్యను బంధువుల ఇంట్లో ఎవరో చనిపోయారని అబద్దం చెప్పి ఇంటికి రప్పించుకున్న భర్త సమ్మయ్య పథకం ప్రకారం హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనతో వీరి ఇద్దరు పిల్లలు తల్లిలేని వారిగా మిగిలిపోయారు.
ఇటీవలి ఘటనలు కొన్ని..
* హనుమకొండ జిల్లా కడిపికొండలో కుటుంబ తగాదాల కారణంగా ఓ వ్యక్తి భార్యతోపాటు మామను సుత్తితో కొట్టి చంపి ఆధారాలను తుడిచిపెట్టేందుకు మృతదేహాలను దహనం చేశాడు.
* వరంగల్ చెన్నారెడ్డి కాలనీలో భార్యను చంపిన అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు.
* అనుమానం, అదనపు కట్నం కారణాలతో 18 ఏళ్ల భార్యను భర్త గొంతు నులిమి చంపిన ఉదంతం కలకలం రేపింది.
* మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఒక నేరంలో వివాహ బంధువుల మధ్య ఉన్న విభేదాలు హింసాత్మక హత్యకు దారితీశాయి.
శిక్షులు పడుతున్నా..
చట్టాల సహాయంతో కఠిన శిక్షలు అమలు చేస్తున్నా, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన, మానసిక కౌన్సెలింగ్ వంటివి నిర్వహిస్తున్నా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. సమాజం ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండి, గొడవలు ముదిరే లోపే పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవడం లేదా పోలీస్ కౌన్సెలింగ్ సేవలను వినియోగించుకోవడం అవసరం ఉంది.
* మానసిక వైద్య నిపుణులు
డాక్టర్ శ్రీధర్‌రాజు ఏమంటున్నారంటే..
క్షణికావేశం :
చాలా సందర్భాల్లో ఈ హత్యలు పథకం ప్రకారం జరగవు. చిన్నపాటి గొడవ జరిగినప్పుడు మెదడులోని భావోద్వేగాలను నియంత్రించే భాగం పనిచేయదు. దీనినే ‘ఇంపల్సివ్ అగ్రెషన్’ అంటారు. ఆ క్షణంలో వారికి తమ పిల్లలు, భవిష్యత్తు, చట్టం ఏవీ గుర్తుకురావు. కేవలం అవతలి వ్యక్తిని అంతం చేయాలనే కోపమే ఉంటుంది.
అనుమానం
పెద్దాపురం ఘటనలో భార్యపై “మరుగు మందు” పెడుతుందనే అనుమానం ఒక రకమైన మనోవైకల్యం. ఎదుటివారు తప్పుడు పని చేస్తున్నారని బలంగా నమ్మడాన్ని ‘పారనోయిడ్ ఆలోచనలు’ అంటారు. ఇది ఒక తీవ్రమైన మానసిక వ్యాధి. దీనికి సకాలంలో వైద్యం అందకపోతే ఇలాంటి దారుణాలకు దారితీస్తుంది.
పిల్లలపై ప్రభావం
కళ్లముందే తల్లి ప్రాణాలు కోల్పోవడం, తండ్రి జైలుకు వెళ్లడం పిల్లల మెదడుపై తీవ్రమైన గాయాన్ని మిగిలిస్తుంది. ఆ పిల్లలు భవిష్యత్తులో తీవ్రమైన భయం, ఆందోళన, కుంగుబాటుకు గురవుతారు.
వారు పెద్దయ్యాక కూడా సమాజాన్ని, మనుషులను నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది.
నివారణ మార్గాలు :
– కుటుంబంలో ఎవరైనా అతిగా అనుమానిస్తున్నా, విపరీతమైన కోపం ప్రదర్శిస్తున్నా వారిని వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలి.
-గొడవలు ప్రారంభ దశలో ఉన్నప్పుడే కౌన్సెలింగ్ తీసుకోవడం వల్ల ఇలాంటి ఘాతుకాలను ఆపవచ్చు.
– మద్యపానం, డ్రగ్స్ వంటి వ్యసనాలు మనిషిలోని హింసాత్మక ప్రవృత్తిని మరింత పెంచుతాయి.
