
* డీలిమిటేషన్‌పై చెన్నయ్‌లో కీలక సమావేశానికి హాజరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చెన్నయ్‌లో డీఎంకే నేతృత్వంలో డీలిమిటేషన్‌పై సమావేశం జరిగింది. తమిళనాడు సీఎం స్టాలిన్ (Stalin) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీలకు అతీతంగా అఖిలపక్ష నేతలు హాజరయ్యారు. సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక కాంగ్రెస్ నుంచి డీకే శివకుమార్, రాజేంద్ర చోళన్, పొనన్నతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanthreddy), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్(Ktr), వినోద్, సురేశ్ రెడ్డి, ఆప్ తరుపున పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, సంజయ్ సింగ్. ఒడిశాలోని బీజేడీ నుంచి ఇద్దరు నేతలు, కాంగ్రెస్ నుంచి ఒకరు, అలాగే కేరళ కాంగ్రెస్ నుంచి మరో ఇద్దరు లీడర్లు, సీపీఐ తరుపున వినయ్ విశ్వం, పంజాబ్‌లోని శిరోమణి అకాలీదల్ పార్టీ నుంచి మరో ఇద్దరు కీలక నేతలు సమావేశానికి హాజరయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు కలగబోయే నష్టాలపై చర్చించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌పై అఖిలపక్ష నేతల భేటీ చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని చెప్పారు. డీలిమిటేషన్ ను కచ్చితంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పునర్విభజనతో విద్యార్థులకు, మహిళలకు తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు. తమిళనాడుకు కేంద్ర సందేశం గందరగోళంగా ఉందని వెల్లడించారు.
డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నాం : రేవంత్ రెడ్డి
కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పన్నులరూపంలో కేంద్రానికి భారీగా చెల్లిస్తున్నా, తక్కువ మొత్తంలో పొందుతున్నామని రేవంత్ రెడ్డి (Revanthreddy) తెలిపారు. రాణిస్తున్న రాష్ట్రాలకు రాజకీయ పరిమితులు విధించడం అభివృద్ధికి విఘాతమని అభిప్రాయపడ్డారు. పారదర్శకంగా లేని డీ లిమిటేషన్ (Delimitation) ను కేంద్రం కట్టడి చేయాల్సి ఉందన్నారు. లోక్‌సభ సీట్లు పెంచకుండా, రాష్ట్రాల్లో అంతర్గత డీ లిమిటేషన్ చేయాలని సూచించారు. డీలిమిటేషన్.. రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానత్వం తీసుకొస్తుందని, దక్షిణాది రాజకీయ వాణి కోల్పోతుందని వెల్లడించారు. ప్రధానమంత్రి మోదీ కూడా లోక్‌సభ సీట్లు పెంచకుండా డీలిమిటేషన్ చేపట్టాలన్నారు. జనాభా ఆధారంగా చేపట్టే పునర్విభజనను దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించబోవని స్పష్టం చేశారు. దక్షిణాదిని సెకండరీ సిటిజన్ గా ఉత్తరాది మారుస్తోందని విమర్శించారు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్.. మిగతా రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయిస్తాని వివరించారు.
వ్యతిరేకించకపోతే చరిత్ర క్షమించదు : కేటీఆర్
కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు కలుగుతున్నాయని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (Ktr) అన్నారు. కేంద్ర వివక్షపూరిత విధానాలతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలగబోతోందన్నారు. ఇది దేశాభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు నష్టమన్నారు. దేశాన్ని వెనక్కి నడిపిస్తున్న రాష్ట్రాలకు లాభమని తెలిపారు. నిధుల కేటాయింపుల్లో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వివరించారు. అధికారం పూర్తిగా కేంద్రీకృతమైన నియంతృత్వం వైపు దారితీసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే సమాఖ్య స్ఫూర్తిగా తీవ్ర విఘాతమన్నారు. డీలిమిటేషన్‌పై ప్రశ్నించకుంటే చరిత్ర మనల్ని క్షమించబోదని వెల్లడించారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
……………………………..