క్రేజ్ పీక్స్‌లో ఉన్నా సామాన్యుడిలా..
రైల్లో శివమ్ దూబె ప్రయాణం..
వైరల్ అవుతున్న ‘అప్పర్ బెర్త్’ స్టోరీ!
ఆకేరు న్యూస్, డెస్క్:
టీ20 ప్రపంచకప్‌లో తనదైన హిట్టింగ్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబె, మైదానంలోనే కాదు నిజ జీవితంలోనూ తనదైన శైలిలో సిక్సర్ కొట్టాడు. ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహంలో అందరూ విలాసవంతమైన ప్రయాణాలు, వేడుకల్లో మునిగిపోతే.. దూబె మాత్రం తన కుటుంబం కోసం ఒక సామాన్యుడిలా రైలు ఎక్కడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అహ్మదాబాద్ టూ ముంబయి: ఒక ‘సీక్రెట్’ జర్నీ
ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత అహ్మదాబాద్ నుంచి ముంబయికి వెళ్లేందుకు విమాన టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. అయితే, తన పిల్లలను వీలైనంత త్వరగా చూడాలనే ఆరాటంతో దూబె ఏమాత్రం తటపటాయించకుండా రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నాడు. ఒక అంతర్జాతీయ క్రికెటర్ అయి ఉండి, సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి సాధారణ ప్రయాణికుడిలా రైలులో ప్రయాణించడం విశేషం.
గుర్తుపట్టకుండా జాగ్రత్తలు.. అప్పర్ బెర్త్‌పై నిద్ర!
తను ఒక స్టార్ క్రికెటర్ అని తెలిస్తే రైలులో రద్దీ పెరిగి, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదని దూబె పక్కా ప్లాన్ వేశాడు. అభిమానులు గుర్తుపట్టకుండా ఉండేందుకు టీషర్ట్‌కు తోడుగా క్యాప్, మాస్క్ ధరించి పూర్తిగా తన ముఖాన్ని కవర్ చేసుకున్నాడు. రైలు బయలుదేరడానికి కేవలం ఐదు నిమిషాల ముందు వరకు తన కారులోనే వేచి చూసి, ప్లాట్‌ఫారమ్‌పై రద్దీ తగ్గాక నేరుగా తన కోచ్‌లోకి వెళ్లాడు. ప్రయాణమంతా అప్పర్ బెర్త్‌పైనే ఉండిపోయి, సైలెంట్‌గా తన గమ్యాన్ని చేరుకున్నాడు.
కుటుంబానికే మొదటి ప్రాధాన్యత:
“నా పిల్లలను చూడాలనే తపన ముందు ఈ ఇబ్బందులేవీ నాకు పెద్దగా అనిపించలేదు. కుటుంబమే నాకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత” అని దూబె పేర్కొన్నాడు. డబ్బు, హోదా ఉన్నా సామాన్య మధ్యతరగతి వ్యక్తిలా ప్రయాణించిన దూబె వ్యక్తిత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “స్టార్ హోదా తలకెక్కించుకోని నిజమైన ఛాంపియన్” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా తన సతీమణితో కలిసి ఆయన చేసిన ఈ ప్రయాణం, కుటుంబం పట్ల ఆయనకున్న బాధ్యతను చాటిచెబుతోంది.
