Urban Water Crisis (AI Generate Image)
* పూణేలో అక్టోబరు 15 నుంచి ప్రతి గురువారం నీటి సరఫరా నిలిపివేత
* ముంబయిలో నీటి దుర్వినియోగంపై చర్యల హెచ్చరిక
* హైదరాబాద్ లో నీటి పొదుపు- ప్రజలకు పిలుపు
* చెన్నై జలాశయాల్లో తగ్గిన నిల్వలు..
* బెంగళూరుకు కావేరీ నిల్వల సవాల్..
* ఢిల్లీలో సరఫరాతోపాటు నాణ్యత సమస్య
* కోల్‌కతాలో తాగు నీటి పంపిణీ వ్యవస్థపై పెరిగిన ఒత్తిడి..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బిందెడు నీళ్లకు మహానగరాలు విలవిల్లాడుతున్నాయి.. పూణే, ముంబయి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ తదితర దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిగా నిలిచే ఈ మహానగరాలకు తాగునీటి సమస్య పెద్ద సవాల్‌గా మారుతోంది. పూణేలో వారానికి ఒకరోజు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.
ముంబయిలో నీటి వినియోగంపై ఆంక్షల దిశగా చర్యలు మొదలయ్యాయి. హైదరాబాద్ అదనపు నీటి వనరులను సమకూర్చుకుంటోంది. చెన్నైలో జలాశయాల నిల్వలు ఆందోళన కలిగిస్తోంది . బెంగళూరులో కావేరీ జలాల లభ్యత కీలకంగా మారింది. ఢిల్లీలో కొన్ని ప్రాంతాలకు సరిపడా నీరు చేరకపోవడంతోపాటు నాణ్యత సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. కోల్‌కతాలో పాత పంపిణీ వ్యవస్థ, భూగర్భజలాలపై ఆధారపడటం దీర్ఘకాల సవాళ్లుగా ఉన్నాయి. వర్షాభావ సమస్యతో పాటు స్థానిక నిర్వహణ లోపాలు తోడై ప్రజల కష్టాలు పెరుగుతున్నాయి.
2026 నైరుతి రుతుపవనాల సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే సుమారు 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వర్షాలు తగ్గడంతో జలాశయాల్లోకి చేరే నీరు, భూగర్భజలాల పునర్భరణపై ప్రభావం పడింది. పసిఫిక్ మహాసముద్రంలో అసాధారణంగా పెరిగే ఉపరితల ఉష్ణోగ్రతలతో ముడిపడిన ఎల్‌నినో భారత నైరుతి రుతుపవనాలను బలహీనపరిచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
* పూణేలో గురువారం నీటి సరఫరా బంద్
పూణే మునిసిపల్ కార్పొరేషన్ అక్టోబరు 15 నుంచి ప్రతి గురువారం నగరవ్యాప్తంగా నీటి సరఫరా నిలిపివేయాలని నిర్ణయించింది. వచ్చే రుతుపవనాల వరకు ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవడమే లక్ష్యం. నిర్మాణ పనులకు తాగునీరు వాడటాన్ని నిషేధించడం, వాహనాల వాషింగ్ కేంద్రాలను మూసివేయించడం వంటి చర్యలనూ చేపట్టింది. ఈ నిర్ణయం కుటుంబాల రోజువారీ జీవితాన్ని మార్చనుంది. ముందుగానే నీరు నిల్వ చేసుకోవడం, సరఫరా పునరుద్ధరణ సమయానికి ఇంట్లో ఉండటం అవసరమవుతుంది.
నిల్వ ట్యాంకులు ఉన్న అపార్ట్మెంట్లతో పోలిస్తే చిన్న ఇళ్లు, ఉమ్మడి కుళాయిలపై ఆధారపడే కుటుంబాలకు ఇబ్బంది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకరోజు కోత తర్వాత చివరి ప్రాంతాలకు సరఫరా సాధారణ స్థితికి రావడానికి ఎంత సమయం పడుతుందన్నదీ కీలకం.
* తలాపున సముద్రం అయినా నీటి లెక్కలు
ముంబయిలో నీటిని పొదుపుగా వాడాలని బృహన్ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ ప్రజలను కోరింది. వృథా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మహారాష్ట్రలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు అక్టోబరు 16 నాటికి నీటి వినియోగంలో 10 శాతం కోత అమలు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
సరఫరా తగ్గినప్పుడు ముందుగా కనిపించే సమస్య నీటి ఒత్తిడి పడిపోవడం. దీనివల్ల పంపిణీ చివరి ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలకు నీరు చేరడం కష్టమవుతుంది. పెద్ద నిల్వ ట్యాంకులు ఏర్పాటు చేసుకోలేని కుటుంబాలకు చిన్న కోత కూడా పెద్ద భారంగా మారవచ్చు. నగరానికి సరఫరా చేసే జలాశయాల్లో మిగిలిన నీటిని వచ్చే వర్షాకాలం వరకు పంపిణీ చేయడమే ఇపుడు అతి పెద్ద సవాల్
* హైదరాబాద్‌లో నీటి పొదుపు చర్యలు
హైదరాబాద్ ప్రధాన పట్టణ ప్రాంతంలో తాగునీటి సరఫరాకు అంతరాయం రాకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అక్టోబరు 13న తెలిపారు. నగర నీటి వనరుల్లో ప్రస్తుతం 560 మిలియన్ గ్యాలన్లు ప్రతిరోజు అందుబాటులో ఉన్నాయని, అదనంగా 60 మిలియన్ గ్యాలన్ల నీటిని వినియోగించుకునేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సమీక్ష వివరాలు వెల్లడిస్తున్నాయి. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని ప్రభుత్వం కోరింది.
అందువల్ల హైదరాబాద్‌లో ఇప్పటికే నగరవ్యాప్తంగా తీవ్ర నీటి కొరత ఏర్పడిందని చెప్పడం సముచితం కాదు. ప్రస్తుతం ప్రభుత్వ చర్యలు రాబోయే నెలల అవసరాల కోసం ముందస్తు భద్రత కల్పించే దిశగా ఉన్నాయి. అదనపు నీటిని సమకూర్చడంతోపాటు సరఫరా చివరి ప్రాంతాలకు చేర్చడం, లీకేజీలను అరికట్టడం, అత్యవసర ట్యాంకర్ సేవలను అందుబాటులో ఉంచడం ప్రాధాన్యం సంతరించుకుంటాయి.
* చెన్నయిలో వర్షాల కోసం ఎదురు చూపులు
చెన్నైకి తాగునీరు అందించే ఆరు ప్రధాన జలాశయాల్లో సెప్టెంబరు చివరినాటికి మొత్తం సామర్థ్యంలో సుమారు 37.9 శాతం నీరు మాత్రమే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఆగస్టులోనే కొన్ని ప్రాంతాల్లో బోరుబావులు ఎండిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో పైపుల సరఫరా తగ్గితే ప్రత్యామ్నాయంగా వినియోగించే భూగర్భజలాలపైనా ఒత్తిడి పెరుగుతోంది. చెన్నై విషయంలో అక్టోబరు – డిసెంబరు ఈశాన్య రుతుపవనాలు అత్యంత కీలకం.
నగరంలో వర్షం కురవడమే కాకుండా జలాశయాల పరివాహక ప్రాంతాల్లో పడటం అవసరం. సెప్టెంబరు చివరినాటి అంచనాలో చెన్నైకు సాధారణ వర్షపాతం ఉండవచ్చంటున్నారు , జలాశయాలు ఉన్న తిరువళ్లూరు ప్రాంతంలో సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది . అందువల్ల చెన్నై భవిష్యత్ సరఫరాను నైరుతి రుతుపవనాల లోటుతో మాత్రమే నిర్ణయించలేం అంటున్నారు.
* కావేరీపై ఆధారపడిన బెంగళూరు నగరం
బెంగళూరుకు నీటిని అందించే ముఖ్యమైన వనరుల్లో కృష్ణరాజసాగర్ ఒకటి. అక్టోబరు 1న అందులో 26.24 టీఎంసీల నీరు ఉండగా, గత ఏడాది అదే తేదీన 47.49 టీఎంసీలు ఉన్నట్లు అక్టోబరు 3న వచ్చిన నివేదిక పేర్కొంది. ఈ తగ్గుదల రాబోయే రాబోయే తాగు నీటి తీవ్రతను తెలుపుతోంది. 2024 లో బెంగళూరు నగరం తీవ్రమైన నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొన్నది . ఏకంగా డిస్పోజబుల్ ప్లేట్లలో తినండి.వైప్స్‌తో ముఖం తుడుచుకోండని ప్రజలకు అపార్ట్మెంట్ అసోసియేషన్ల సూచించాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితి ఎదురు కాకుండ ఉండేందుకు ముందస్తు చర్యలు బెంగళూరు నగర పాలక సంస్థలు చేపడుతున్నాయి.
* ఢిల్లీలో నాణ్యత మరో సమస్య
ఢిల్లీలో ఈ ఏడాది జూన్‌లో యమునా నీటిమట్టం తగ్గడంతో వజీరాబాద్, చంద్రావల్ శుద్ధి కేంద్రాల పరిధిలోని చివరి ప్రాంతాల్లో తాగు నీటి సరఫరా సమస్యలు తలెత్తాయి .కొన్ని కాలనీల్లో కుళాయిలు ఎండిపోవడం, మురికి నీరు రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సెప్టెంబరులో యమునాలో మూడు ప్రదేశాల్లో నీటి నాణ్యతలో సమస్యలున్నట్లు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ గణాంకాలు చెబుతున్నాయి. నీటి లభ్యతతో పాటు నాణ్యమైనా తాగునీటి సరఫరా అందించడం ఢీల్లీ నగర పాలక సంస్థలకు అతి పెద్ద సవాల్ గా మారుతోంది
* కోల్‌కతాలో పంపిణీ వ్యవస్థే బలహీనత
కోల్‌కతాలో భూగర్భజలాల తగ్గుదల, వేసవిలో తక్కువ సరఫరా వంటి సమస్యలు గతం నుంచే ఉన్నాయి. పాల్తా శుద్ధి కేంద్రం నుంచి టాలా రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్రధాన పైపులైన్‌పై మెట్రో నిర్మాణ పనుల ప్రభావం పడవచ్చని గత నెలలో అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తగిన ప్రత్యామ్నాయం లేకుండా పైపులైన్‌ను తొలగిస్తే ఉత్తర, మధ్య కోల్‌కతా సరఫరాకు భవిష్యత్తులో ఇబ్బంది కలగవచ్చని అధికారులు చెబుతున్నారు.
* మౌళిక వసతులు అవసరం
ఎల్‌నినో ప్రభావం , వర్షాల లోటు నగర నీటి వ్యవస్థలపై తీవ్రంగా ఒత్తిడి పెంచుతున్నాయి. సమస్య ఎదురయినప్పుడే స్పందించడం పాలక వర్గాల సహజ నైజంగా మారిపోయింది. ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలే అభివృద్ధికి నిదర్శనంగా పాలక వర్గాలు భావిస్తున్నట్లు కనిపిస్తుంటాయి.. ప్రజల భవిష్య త్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరాల్లో మౌళిక వసతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

