
– డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలను వెంటనే పూర్తి చెయ్యాలి
– ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారు 45 రోజుల్లో బేస్మెంట్ లెవెల్ పూర్తిచేయాలి.
– హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.మండలంలోని గూడూరు, కమలాపూర్, మర్రిపల్లి గూడెం లోని రెండు పడక గదుల ఇళ్ల వద్ద తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీ, తదితర మౌలిక వసతుల కల్పన, పైలట్ గ్రామమైన దేశరాజు పల్లి లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని గృహ నిర్మాణ, ఆర్ అండ్ బి శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతి గురించి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ మూడు గ్రామాలలోని రెండు పడక గదుల ఇళ్ల సముదాయంలో తాగునీరు విద్యుత్ డ్రైనేజ్ వ్యవస్థల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బి శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దేశరాజుపల్లి లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారు తప్పనిసరిగా 45 రోజుల్లో బేస్మెంట్ లెవెల్ నిర్మాణం చేపట్టాలని, ఎవరైతే సకాలంలో ప్రారంభించరో వాటిని రద్దుచేసి అర్హులకు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. అదేవిధంగా నిర్మాణంలో ఉన్న మంజూరైన గృహాలన్నీ కూడా సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని, ఇండ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేసుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డీఈ సిద్ధార్థ నాయక్, ఆర్ అండ్ బి డీఈ రాజు పాండే, కమలాపూర్ తహసిల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో గుండె బాబు, ఇతర అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
………………………………..