
* గర్భవతిని చేసి ఉడాయించిన చెలికాడు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఓ భార్యమణి.. ప్రియుడిపై మోహంతో భర్తకు విడాకులు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన చెలికాడు.. గర్భవతిని చేసి ఉడాయించిన వైనం.. పోలీసులను ఆశ్రయించిన ఉదంతం.. ఇవీ నేటి పోకడలు.. ఇలాంటి సంఘటనే ఇటీవల చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు.. . ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల (bapatla) కు చెందిన వివాహిత (24) హైదరాబాద్ (hyderabad) మధురానగర్లోని ఓ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నది. ఐదేళ్ల కిందట వివాహం కాగా, భర్తతో మనస్పర్థల కారణంగా విడిగా ఉంటున్నది. ఈ క్రమంలో ఆమెపై దూరపు బంధువు గోపి(24) కన్నేసి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని భర్తకు విడాకులివ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో భర్తకు విడాకులు ఇచ్చింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ఆమె గర్భం దాల్చింది. ఈ క్రమంలో త్వరగా పెళ్లి చేసుకుందాం అని గోపి ని కోరింది. దీంతో పెళ్లి మాటను దాటవేస్తూ కాలం గడుపుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె తనని మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకుంది. గోపి కుటుంబ సభ్యులతోపాటు పెళ్లి చేసుకోబోయే యువతి కుటుంబసభ్యులను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె వివరించింది. గోపి సోదరుడు తీవ్ర పదజాలంతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో గోపిపై మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
………………………………………………………