* ఇతర పార్టీ అభ్యర్థిపై ప్రత్యేక నిఘా
* కోడ్ ఉల్లంఘనల నమోదుకు టీంల ఏర్పాటు
* తమ బలం కన్నా.. ఎదుటివారి బలహీనతలపైనే ప్రచారం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
గ్రేటర్ హైదరాబాద్‌లో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపపోరులో వినూత్న పోకడలు కనిపిస్తున్నాయి. ఎదుటి పార్టీ అభ్యర్థులపై నిఘా కోసం ఒకరిపై మరొకరు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తమ బలాన్ని ప్రచారం చేసుకోవడం కన్నా, ఎదుటి పార్టీ అభ్యర్థి బలహీనతలనే ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత ప్రచారసరళిని పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
కొత్తదారులు.. ప్రత్యేక టీంలు
ఉప ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ విస్తృతంగా పోరాడుతున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆ నేతల ప్రచారంపై నమ్మకం పెట్టుకోకుండా గెలిచేందుకు అభ్యర్థులు కొత్తదారులను వెదుకుతున్నారు. ప్రత్యర్థుల ప్రచారంపై ఎక్కువగా దృష్టి పెడుతూ తదనుగుణంగా తమకు కలిసొచ్చే అంశాలపై వ్యూహ రచన చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే, కోడ్ ఉల్లంఘనలను నమోదు చేసి, ఈసీకి ఫిర్యాదు చేసేందుకు కూడా టీంలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. తమ బలాలు, ప్రత్యర్థుల బలహీనతలను తెలుసుకుంటూ ప్రచారసైలిని మార్చుతూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రహస్య సమావేశాలు.. పనులు
యుద్ధంలో గెలవాలంటే శత్రువు కదలికలూ తెల్సుకోవాలన్న సూత్రాన్ని పార్టీలు పాటిస్తున్నాయి. ప్రత్యర్థి ఏ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నాడు? ఏ కాలనీ సంఘాలు, బస్తీ వాసులతో సమావేశాలు ఏర్పాటు చేశాడు? ఎవరికి గెట్ టు గెదర్ ఇస్తున్నాడు? అన్న సమాచారాన్ని రాబడుతున్నారు. ప్రత్యర్థి పార్టీ ప్రచారం చేసిన ప్రాంతాల్లో రెండు, మూడు రోజుల్లో ప్రచారం ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కాలనీ, అపార్ట్మెంట్ వాసులతో నేతలు రహస్యంగా సమావేశమవుతున్నారు. వారికున్న ఇబ్బందులను తెల్సుకొని పరిష్కారిస్తామని హామీ ఇస్తున్నారు. యూసుఫ్‌గూడలోని ఓ అపార్ట్మెంట్లో మరమ్మతు పనులు వ్యయం భరించేందుకు ప్రధాన పార్టీ అభ్యర్థి ఒకరు సిద్ధమైనట్టు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా పనులు చేయించేందుకు అనుచరులను పురమాయుంచినట్టు తెలిసింది.
ఒక్కో పనికి ఒక్కో బృందం
ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసే బృందాలు కొన్నయితే.. రోజూ ప్రచార ప్రణాళికలను మరి కొన్ని టీంలు చూసుకుంటున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మెజార్టీ నేతలు ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో కనిపిస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి చేస్తామని ఓ పార్టీ చెబితే.. గతంలో ఘనమైన డెవలప్మెంట్ చేశామని మరో పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తామని మరో పార్టీ చెబుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు మాటలతో పాటు చేతలూ ప్రదర్శిస్తున్నారు. సెలూన్లో కటింగ్, బజ్జీలు వేయడం, పిల్లలకు చపాతి తినిపించడం వంటివి ప్రచారంలో కనిపిస్తున్నాయి.
…………………………………………………….
