
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : అంగన్ వాడీల పనితీరుపై మంత్రి సీతక్క సచివాలయంలో
సమీక్షా సమావేశం నిర్వహించారు.అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సకాలంలో
అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. గుడ్లు, పాలు, పప్పు, మంచినూనె,
స్నాక్స్, బాలమృతం సరఫరాపై సమీక్ష జరిపారు. అధికారుల నివేదిక ప్రకారం పాలు
మినహా మిగిలిన వస్తువులన్నీ 98 శాతం పైగా సరఫరా అవుతుండగా, పాలు మాత్రం
గత నెలలో 58 శాతం మాత్రమే సరఫరా అయ్యాయని తెలిపారు. పాల సరఫరా లోపంపై
మంత్రి సీరియస్గా స్పందించారు. అలాగే గుడ్ల సరఫరా విషయంలో మంత్రి శ్రీమతి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.గుడ్ల సరఫరాలో కలర్ కోడింగ్ తప్పనిసరి అని మంత్రి
స్పష్టం చేస్తూ, ప్రతి పది రోజులకు ఒకసారి ఏజెన్సీలు గుడ్లు సరఫరా చేయాలని ఆదేశించారు. లేనిపక్షంలో కాంట్రాక్టులను రద్దు చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్ఫాస్ట్ స్కీం ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. 1261 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి లక్ష్యాన్ని నిర్ణయించగా, 1181 కేంద్రాలకు స్థలాలు గుర్తించామని అధికారులు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించి నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి లోపు భవనాల నిర్మాణం పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. ఈ నెల 19, 20 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగినులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వచ్చంద సంస్థలతో మహిళా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, మహిళల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు మంత్రి శ్రీమతి సీతక్క ప్రకటించారు. ఈ సమావేశంలో శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ సృజన, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖలో జరుగుతున్న పనుల పురోగతిపై, అమలవుతున్న పథకాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
………………………………………………….