* సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ
హైదరాబాద్: పరీక్షలంటే విద్యార్థులకు భయం ఉండటం సహజం. అయితే ఇక్కడ విద్యార్థి తన పరీక్షా పత్రాన్నిసమాధానాలతో పాటు తన జీవితంలోని నిస్సహాయత, కన్నీటి గాథతో నింపేశాడు. అంతేకాకుండా తనలోని చిత్రకళ ద్వారా తన మనోగతాన్ని వివరించడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన విద్యా వ్యవస్థలోని మరో కోణాన్ని చూపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆన్సర్ షీట్ ప్రతీ హృదయాన్ని కదిలిస్తోంది.
“నేను చదివినవి రాలేదు సార్..”
“సార్, నేను చదివిన ప్రశ్నలు ఏవీ పరీక్షలో రాలేదు. దయచేసి నన్ను పాస్ చేయండి .. నాకు అమ్మ, నాన్న లేరు. మీరే నాకు అమ్మ, నాన్న అన్నీ..” అంటూ తన అనాథ పరిస్తితిని గుర్తు చేసుకున్నాడు.
బొమ్మలు గీసి.. బాధ వివరించి
తన భావాన్ని మాటలతోనే కాకుండా బొమ్మల రూపంలోనూ ఆ విద్యార్థి వివరించడానికి ప్రయత్నించడం గమనార్హం. “గురువే దైవం.. గురువును నమ్ముకున్నవాడికి దేవుడు సహాయం చేస్తాడు” అనే నినాదంతో పాటు.. గురువు పాదాలను ఒక శిష్యుడు పట్టుకున్నట్లుగా గీసి, అక్కడ “సార్.. నేను” అని రాశాడు. ఇది ఆ పిల్లాడికి తన టీచర్ మీద ఉన్న అపారమైన గౌరవానికి, నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోంది.
మార్కుల కంటే మనిషి ముఖ్యం!
ప్రతి విద్యార్థి పరిస్థితి ఒకేలా ఉండదు. కొందరు మానసిక ఒత్తిడితో, మరికొందరు కుటుంబ సమస్యలతో సతమతమవుతుంటారు. కేవలం పరీక్షల్లో వచ్చే మార్కులే కొలమానం కాదని, ఇలాంటి విద్యార్థుల నేపథ్యాన్ని అర్థం చేసుకుని వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై, ఉపాధ్యాయులపై ఉందని ఈ వైరల్ ఫోటో గుర్తు చేస్తోంది.
ఈ పేపర్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ పిల్లాడికి తగిన సహాయం అందాలని, చదువులో అతడిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు. ఏదేమైనా, ఒక చిన్నారి రాసిన ఈ ఆవేదన భవిష్యత్ తరాల విద్యా విధానంలో మార్పు రావాలని కోరుకుంటోంది.
