* అక్రమాలు జరిగినట్టు పలు ఆధారాలున్నాయి
* తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం సరికాదు
* కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ విమర్శలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఫార్ములా ఈ-రేస్ కేసులో తాను కడిగిన ముత్యమంటూ కేటీఆర్ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకోవడంపై టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ స్పందించారు. ఫార్ములా ఈ- రేసులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని.. అక్రమాలు జరిగినట్టు పలు ఆధారాలున్నాయన్నారు. తనకు తానే కేటీఆర్ సర్టిఫికేట్ ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం పంపిన ఆధారాలపై గవర్నర్ న్యాయసలహా తీసుకొని కేసుకు అనుమతించాక అక్రమ కేసు ఎలా అవుతుందన్నారు. చట్టపరంగా కేసు నమోదు అయినందున కోర్టులో తేల్చుకోవాలన్నారు.
శుక్రవారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మండలి మీడియా పాయింట్ వద్ద మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడారు. ఈ-రేస్‌లో హెచ్ఎండీఏ భాగస్వామ్యం కాకపోయినా విదేశీ సంస్థకు ఆనాడు 55 కోట్ల నిధులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అంతేకాదు మూడేళ్ల పాటు రేసింగ్ జరిగేలా 600 కోట్లతో ఒప్పందం జరగలేదా? అంటూ ప్రశ్నలు సంధించారు. ఆధారాలు కనిపిస్తున్నా అక్రమాలకు పాల్పడలేదని కేటీఆర్ బుకాయించడాన్ని తప్పుబట్టారు. నిబంధనలకు విరుద్దంగా హుస్సేన్‌సాగర్ చుట్టూ ఫార్ములా ఈ రేసు కోసం 2.8 కి.మీల ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. కేసులో అధికారులకు సహకరించాల్సిన కేటీఆర్, అహంకారంతో విర్రవీగుతూ ఉద్యమకారులంటూ కేసుకు సంబంధం లేని మాటలు చెప్పడంపై మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
……………………………………