
* ఆర్థికలాభాలు ఉంటాయి : కేంద్రం
ఆకేరు న్యూస్ డెస్క్ : E20 (Ethanol Blended Petrol) పెట్రోల్‌పై వస్తున్న విమర్శలకు పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. E20 పెట్రోల్ వల్ల ఇంజిన్‌కు నష్టం వాటిల్లుతుందని, ఇంధన సామర్థ్యం స్వల్పంగా తగ్గుతుందనే ఆందోళనలు నిరాధారమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇథనాల్ కలపడం వల్ల దేశానికి పర్యావరణ పరంగా, ఆర్థికంగా ప్రయోజనాలు ఉన్నాయంటోంది. అంతేకాకుండా ముడి చమురు దిగుమతులపై ఆధార పడటం తగ్గుతుందని పేర్కొంది. రైతుల ఆదాయం పెరగడంతోపాటు కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. E20 పెట్రోల్‌లోని ఇథనాల్‌కు సాధారణ పెట్రోల్ కంటే ఎక్కువ ఆక్టేన్ సంఖ్య ఉంటుందని, ఇంజిన్‌ను మరింత సున్నితంగా, సమర్థవంతంగా పని చేసేలా చేస్తుంది. ముఖ్యంగా ఆధునిక, అధిక కంప్రెషన్ రేషియో గల ఇంజిన్లలో ఇది మెరుగైన పని తీరును చూపిస్తుంది. E20 పెట్రోల్ వాడకం వల్ల ఇంధన సామర్థ్యం కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. ఇది చాలా స్వల్పం. E10 ఇంధనం కోసం రూపొందించబడినప్పటికీ.. E20కి అనుకూలంగా ఉండే వాహనాలకు మైలేజీలో 1 నుంచి 2 శాతం తగ్గుదల ఉంటుందని, ఇతర వాహనాలకు ఈ తగ్గుదల 3 నుంచి 6 శాతం వరకు ఉండవచ్చని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే ఈ స్వల్ప నష్టాన్ని కూడా మెరుగైన ఇంజిన్ ట్యూనింగ్, E20కి అనుకూలంగా ఉండే భాగాల వాడకం ద్వారా తగ్గించవచ్చని పేర్కొంది.
……………………………………………