
* టీకప్పులో తుఫానా..?
ఆకేరున్యూస్ డెస్క్: రాజకీయాల్లో కొన్ని విషయాలు చిలికి చిలికి గాలి వానలా మారితే కొన్ని
విషయాలుటీ కప్పులో తుఫాన్ లా చల్లారిపోతాయి. ఇక సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీ( CONGRESS PARTY) లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరిని ఎవరు విమర్శిస్తున్నారో.. ఎవరిని ఎవరు సమర్థిస్తున్నారో తెలియని పరిస్థితి ఉంటుంది, మిగతా పార్టీలతో పోల్చితే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పక తప్పదు. ఇది పార్టీకి ఒక్కో సారి ప్లస్ గా మారితే ఒక్కో సారి మైనస్ గా మారుతుంది. లేటెస్ట్ గా మునుగోడు (MUNUGODU) ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA KOMATI REDDY RAJAGOPAL REDDY) వ్యవహారం ఏమవుతుందోననే చర్చ జరుగుతోంది. తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు కినుకు వహించిన రాజగోపాల్ రెడ్డి సందర్భం వచ్చినప్పడు సీఎం రేవంత్ రెడ్డి ( CM REVANTH REDDY) పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.శుక్రవారం నాడు సర్దార్ వల్లభ్ భాయి పటేల్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా.. యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో నిర్వహించిన సభలో ఆయన మరోసారి సీఎం రేవంత్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు బిల్లు ఆగిపోవడంతో కాంట్రాక్టర్ పని చేయడం లేదని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బిల్లును విడుదల చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు.గత 20 నెలలుగా మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు, భవనాల కోసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి మంజూరు కాలేదని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మంత్రిని కలిసి అడిగినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ నేపధ్యంలో శనివారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ( MAHESH KUMAR GOUD) మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పార్టీ క్రమశిక్షణా సంఘం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పదని కొందరు అభిప్రాయపడుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సహజమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు.
…………………………………………………………….