
* అలకబూనిన కొందరు ఎమ్మెల్యేలు
* మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతో..
* సుదర్శన్ రెడ్డి ఇంటికి టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ఇన్చార్జి
* అందుబాటులో లేని ఆ ఇద్దరు?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి సహా 12 మంది ఉండగా, ఆ సంఖ్య 15కు చేరింది. కొత్తగా జి.వెంకటస్వామి (G.VENKATA SWAMY), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (LAXMAN KUMAR), వాకిటి శ్రీహరి (VAKITI SRIHARI) ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సామాజిక సమీకరణాలను బట్టి మాల, మాదిగ, ముదిరాజ్ వర్గాలకు అవకాశం కల్పించారు. ఇదిలాఉండగా, అప్పుడు ఇప్పుడు అంటూ మంత్రి వర్గ విస్తరణపై కొద్ది నెలలుగా వార్తలు చలామణి అవుతూనే ఉన్నాయి. ఇటువంటి వార్తలు వచ్చినప్పుడల్లా కొన్ని పేర్లు తెరపైకి వచ్చేవి. నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఎమ్మెల్సీ విజయశాంతి తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపించేవి.
హుటాహుటిన సుదర్శన్ రెడ్డి ఇంటికి..
ఆరుగురితో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావించగా, ప్రస్తుతం కేవలం ముగ్గురికి మాత్రమే అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే మొదట్నుంచి వచ్చిన ఊహాగానాల్లోనూ కొందరికి అవకాశం రాలేదు. దీంతో వారిలో కొందరు మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో వారిని బుజ్జగించేందుకు హైకమాండ్ సిద్ధమైంది. మంత్రివర్గంలో తనకు స్థానం లభించకపోవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సుదర్శన్ రెడ్డి (SUDARSHAN REDDY) ప్రకటించారు. ఈ నేపథ్యంలో హుటాహుటిన ఆదివారం ఉదయం ఆయన నివాసానికి ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్ వెళ్లారు. ఆయనతో సంప్రదింపులు జరిపారు.
అందుబాటులో లేని ఆ ఇద్దరు?
సుదర్శన్ రెడ్డితో చర్చల అనంతరం ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(RAJA GOPALREDDY), ప్రేమ్‌సాగర్‌రావుతో కూడా మాట్లాడేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే వారిద్దరూ అందుబాటులో లేకుండాపోయినట్లు సమాచారం. మరోవైపు విజయశాంతికి మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు ఏకంగా హోంమంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆమెకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఇదిలా ఉంటే, హైదరాబాద్ పరిధిలో ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన మల్రెడ్డి రంగారెడ్డి (MALREDDY RANGAREDDY) కూడా మంత్రి పదవి ఆశించారు. కానీ, సామాజిక సమీకరణాలతో ఆయనకు అవకాశం దక్కలేదు. ఈక్రమంలో ఆయన ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం పెడతారని సమాచారం. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఈరకంగా మంత్రి వర్గ విస్తరణ అనంతరం కాంగ్రెస్ కు నిరసన సెగ తప్పేలా కనిపించడం లేదు.
……………………………………