* సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
* తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు
* నిండుతున్న జలాశయాలు
* జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్
* కరీంనగర్‌ను వీడని వాన
* పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించిన మంత్రి తుమ్మల
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణను వానలు వీడడం లేదు. మూడు రోజులుగా ఎక్కడోచోట వానలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో జన సాధారణ జీవనం స్తంభిస్తోంది. భారీ వర్షాలకు కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి జిల్లా (Bhadradri District) లోని ఇల్లందు (Illandu), కోయగూడెం ఓపెన్‌కాస్ట్ గనుల్లో (Koyagudem opencast mines) కి వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 35 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామికవాడలో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రోజుకు 80 వేల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఓపెన్‌కాస్ట్ గనుల్లో చేరిన నీటిని అధికారులు బటయకు పంపిస్తున్నారు.
వంతెనపై నుంచి వరద ప్రవాహం
భారీ వర్షాలకు ములుగు జిల్లా (Mulugu District) టేకులగూడెం (Tekulagudem) గ్రామం వద్ద గల రేగుమాకు వాగు (Regumaku Vagu) వంతెన పై నుంచి ప్రవహిస్తున్నది. దీంతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ (Telangana-Chhattisgarh) రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాగా,తెలంగాణతోపాటు ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుం డటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. కర్ణాటక (Karnataka), మహారాష్ట్ర (Maharashtra) నుంచి వరద పోటెత్తడంతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు (Jurala Project) కు క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రాజెక్టుకు 90,800 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 17 గేట్లు ఎత్తి 66,810 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,084 క్యూసెక్కులు వదలుతున్నారు. జూరాల ప్రాజెక్టు మొత్తం నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.50 మీటర్ల వద్ద నీరు ఉన్నది. జలాశయం నీటి నిల్వ 9.657 టీఎంసీలు. ఇప్పుడు 7.645 టీఎంసీలు ఉన్నాయి. కాగా, జూరాల నుంచి పెద్ద ఎత్తున నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో శ్రీశైలానికి 1,04,416 క్యూసెక్కులు వస్తున్నది. అధికారులు 99,894 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) కు వరద పోటెత్తింది. సాగర్‌లో ప్రస్తుతం 504.50 అడుగుల వద్ద నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు నుంచి 9,874 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నది.
ప్రాజెక్టు పరిశీలించిన మంత్రి తుమ్మల
అశ్వరావుపేట మండలం (Ashwaraopeta mandal) లోని పెద్దవాగు ప్రాజెక్టు (Peddavagu project) ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. నష్టతీవ్రతను అంచనా వేశారు. ప్రభుత్వం తరఫున తగిన విధంగా ఆదుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. తుమ్మల వెంట స్థానిక ఎమ్మెల్యే, అధికారులు ఉన్నారు.
హుజూరాబాద్‌లో వాన హోరు..
కరీంనగర్ జిల్లా (Karimnagar district) లోని హుజూరాబాద్ (Huzurabad) లో శనివారం రాత్రి ప్రారంభమైన వాన ఇప్పటికీ కొనసాగుతున్నది. దీంతో చిలుకవాగు నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ నుంచి వడ్డెరకాలని, కనుకులగిద్దకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షానికి పెద్దపల్లి జిల్లా (Peddapally district) కేంద్రంలోని శాంతినగర్ ఎస్సారెస్పీ కాలువ (Shantinagar SRSP Canal) పక్కన ఇల్లు కూలిపోగా, బాధితులను మున్సిపల్ సిబ్బంది పెద్దపల్లిలోని పునరావాస కేంద్రానికి తరలించారు. అత్యవసర సాయానికి పెద్దపల్లి పట్టణ ప్రజల కోసం మున్సిపల్ హెల్ప్ లైన్ 6303127484కు ఫోన్ చేయాలని కమిషనర్ ఆకుల వెంకటేశం సూచించారు. కరీంనగర్‌లోని గోదాంగడ్డలో శిథిలావస్థకు చేరిన అజ్జూ అనే వ్యక్తి సంబంధించిన పెంకుటిల్లు పైకప్పు కూలిపోయింది. ఇంట్లోనివారు అప్రమత్తంగా ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఎక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు కరీంనగర్ నగరపాలక సంస్థ డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచింది. వరుస వర్షాలతో జగిత్యాల జిల్లా (Jagityala district) కు వాతావరణ శాఖ (Meteorological department) ఆరెంజ్ అలర్ట్ (Orange alert) జారీ చేసింది.
——————