
* ఉగ్రవాదంపై పోరులో అనేక చర్యలు చేపట్టాం
* జమ్ముకశ్మీర్ ను అతలాకుతలం చేయడమే లక్ష్యంగా పహల్గాం దాడి
* ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న పాక్
* సీమాంతర ఉగ్రవాదంపై పోరు భారత్ హక్కు
* విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
ఆకేరు న్యూస్, డెస్క్ : పహల్గాం ఘటనలో 26మందిని పొట్టనపెట్టుకున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి తమ పనేనని టీఆర్ ఎఫ్ ప్రకటించుకుందని వెల్లడించారు. ఉగ్రమూకలకు పాకిస్థాన్ అండగా నిలుస్తోందని ఆరోపించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయమిస్తోందన్నారు. టీఆర్ ఎఫ్‌కు పాకిస్తాన్ అండదండలు ఉన్నాయని వెల్లడించారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ పై ఇప్పటికే నిషేధం ఉందని తెలిపారు. ఉగ్ర సంస్థలపై నిషేధం దృష్ట్ర్యా టీఆర్ ఎఫ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. టీఆర్ ఎఫ్ వెనుక ఉన్నది లష్కరే తోయిబా, జైషే మహ్మద్ అనే సంస్థలని అన్నారు. టీఆర్ ఎఫ్ గురించి ఇప్పటికే ఐక్య రాజ్యసమితికి ఫిర్యాదు చేశామన్నారు. జమ్ముకశ్మీర్ ను అతలాకుతలం చేయడమే లక్ష్యంగా పహల్గాం దాడి జరిగిందన్నారు. కొంతకాలంగా కశ్మీర్ లో పర్యాటకం వృద్ది చెందుతోందని, జమ్ము అభివృద్ధిని అడ్డుకునేందుకే పహల్గాం దాడి జరిగిందని పేర్కొన్నారు. అక్కడ క్రూరంగా ఉగ్రదాడి జరిగింది.. కుటుంబ సభ్యుల కళ్లముందే ఘోరంగా చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రెండో అతిపెద్ద ఘటన అని తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా నిందితులను గుర్తించామని వివరించారు. ఉగ్రవావాదంపై పోరులో భాగంగా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామన్నారు. తెల్లవారుజామున ఉగ్రమూకల శిబిరాలపై దాడులు నిర్వహించామని, సీమాంతర ఉగ్రవాదంపై పోరాటం భారత్ హక్కు అని చాటిచెప్పారు. పహల్గాం దాడి తర్వాత మరిన్ని దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలిపారు. మరిన్ని దాడులు జరగకుండా చూడడం అత్యవసరంగా మారిందన్నారు.
…………………………………………………….