
* పరిపాలనా సౌలభ్యం కోసమే పేరు మార్పు
* పొట్టి శ్రీరాములు, రోశయ్య, ఆర్యసమాజం పట్ల ప్రభుత్వానికి అపార గౌరవం
* అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
* తెలుగు వర్సిటీ పేరు మార్పునకు ఆమోదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పేరు మార్పు బిల్లునకు శాసనసభ ఆమోదం తెలిపింది. సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మార్చారు. నిజాంకు వ్యతిరేకంగా సురవరం ప్రతాపరెడ్డి పోరాడారని సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanthreddy) తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆర్టీసీ, సివిల్ సర్వీస్ కమిషనర్ పేర్లు మార్చుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వానికి ఒక్క కులం పట్ల ప్రత్యేక అభిమానం ఉందని విమర్శిస్తున్నారని, నాకే ఆ భావన ఉంటే మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ(Chakali ilamma) పేరు పెట్టేవాణ్నా అని ప్రశ్నించారు. మరో వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda laxman bapuji) పేరు పెట్టేవాణ్నా అన్నారు. కులాలను కించపరిచేలా మాట్లాడడం సరికాదని విపక్షాలకు సూచించారు. గుజరాత్లో ఓ స్టేడియానికి పటేల్ పేరు మార్చి మోదీ (Modi) పేరు పెట్టారని, తాము అలాంటి పనులను చేయడం లేదని చెప్పారు. ఒకే పేరుపై రెండు రాష్ట్రాల్లో రెండు వర్సిటీలు ఉండకూడదనే పేరు మారుస్తున్నామని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసమే వర్సిటీల పేరు మార్పు అని తెలిపారు. పొట్టి శ్రీరాములు, రోశయ్య, ఆర్యసమాజం పట్ల ప్రభుత్వానికి అపార గౌరవం ఉందన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapalli Railwayterminal) కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నా అని అన్నారు. బల్కంపేట నేచర్ క్యూర్ ఆస్పత్రి పక్కనే రోశయ్య నివాసం ఉండేదని, ఆ ఆస్పత్రికి రోశయ్య పేరు పెట్టాలని అధికారులను ఆదేశిస్తున్నా అని తెలిపారు. ఆ ఆస్పత్రిలో రోశయ్య విగ్రహం పెడతామని రేవంత్ రెడ్డి తెలిపారు., కాగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పేరు మార్పును బీజేపీ (Bjp) సభ్యులు వ్యతిరేకించారు. కావాలంటే ఉస్మానియా వర్సిటీకి సురవరం పేరు పెట్టుకోవాలని సూచించారు. ఇదిలాఉండగా పేరు మార్పును సీపీఐ(cpi) ఆహ్వానించింది. పేరు మార్పు విషయంలో వివాదం సరికాదని కూనంనేని సాంబశివరావు అన్నారు.
…………………………………….