
* హైదరాబాద్వాసులారా బహుపరాక్
* సాయంత్రం, రాత్రి అతి భారీ వర్షం!
* భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా అలర్ట్
* ప్రజలకు పలు సూచనలు
* సర్కారుకూ విజ్ఞప్తులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సాధారణ వర్షానికే హైదరాబాద్ (Hyderabad) ఆగమాగం అవుతుంది. జలదిగ్బందంతో పాటు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుని నగరవాసులు నరకం అనుభవిస్తారు. అలాంటిది భారీ వర్షాలు.. సుమారు 10 నుంచి 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవ్వచ్చని హెచ్చరికలు.. వాతావరణ శాఖ చెప్పినట్లుగానే నగరంలోని పలుచోట్ల వర్షం మొదలైంది. దీనికి సాయంత్రం, రాత్రి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తాజాగా మరిన్ని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ, రహదారులపై నీటి నిల్వల తొలగింపు వంటి చర్యలు చేపడుతున్న హైడ్రా ప్రజలకు పలు కీలక సూచనలు చేసింది. అలాగే కొన్ని ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికీ విజ్ఞప్తి చేసింది. హైడ్రా సూచనల మేరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వర్క్ ఫ్రమ్ హోం పాటించాలని సాఫ్ట్ వేర్ కంపెనీలకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే వరంగల్(Warangal), హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించగా, జీహెచ్ఎంసీ పరిధిలో నేడు, రేపు ఒంటిపూట బడులు ఉండనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అలర్ట్ గా ఉండాలని.. సెలవులు రద్దు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వాన మొదలైంది.. ఇబ్బందులూ..
వాతావరణ శాఖ, హైడ్రా చెప్పినట్లుగానే మంగళవారం అర్ధరాత్రి నుంచే వాన మొదలైంది. బుధవారం ఉదయానికి పలుచోట్ల రహదారులపై నీళ్లు నిలిచాయి. వర్షం మొదలుకావడంతో తీవ్రత పెరిగింది. ఫలితంగా పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, ట్యాంక్ బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట (Panjagutta) ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు మొదలయ్యాయి. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఈ రోజు (బుధవారం) అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అధికారులు కూడా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. నీటి నిలవ ప్రాంతాల్లో బృందాలను మోహరింపచేశారు.
……………………………………………………………..