Jannagadhapalli| ఆకేరు న్యూస్, రాయపర్తి: భూ రికార్డుల ప్రక్షాళన, భూముల సరిహద్దు వివాదాల పరిష్కారమే లక్ష్యంగా వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జగన్నాధపల్లి గ్రామంలో భూముల రీ-సర్వేకు అధికారులు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామ రెవెన్యూ సరిహద్దుల నిర్ధారణ, రైతుల భూముల హద్దుల గుర్తింపు, భూ రికార్డుల పరిశీలనపై సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. వరంగల్ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ఎల్. కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యం
గ్రామంలో చేపట్టనున్న రీ-సర్వే ప్రక్రియపై రైతులకు పూర్తి అవగాహన కల్పించడంతో పాటు, సర్వే సమయంలో ఎదురయ్యే సందేహాలు, సమస్యలు, అభ్యంతరాలను తెలుసుకోవడమే గ్రామసభ ప్రధాన ఉద్దేశమని అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. రైతుల అభిప్రాయాలు, సూచనలను స్వీకరించి సర్వే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.
పారదర్శకంగా సర్వే
రైతుల భూముల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా, శాస్త్రీయ పద్ధతుల్లో పారదర్శకంగా రీ-సర్వే పూర్తి చేస్తామని అడిషనల్ కలెక్టర్ భరోసా ఇచ్చారు. భూ రికార్డుల పరిశీలనతో పాటు భూముల సరిహద్దులను స్పష్టంగా గుర్తించడం ద్వారా భవిష్యత్తులో వివాదాలు తగ్గేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.
అధికారుల హాజరు
ఈ గ్రామసభలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సుమ, రాయపర్తి తహసీల్దార్ ఎం. శ్రీనివాస్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే రాజేంద్రాచారి, ఎంపీడీఓ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్, గ్రామ పెద్దలు, సర్వే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

