* ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల వెల్లువ
* నేటి ఈ స్వేచ్ఛావాయువుల కోసం.. ఆయువు వదిలినవారెందో..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ నేల నేడు సంబురాలతో సందడిగా మారింది. రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీల నుంచి జాతీయ, రాష్ట్ర, జిల్లా, గల్లీ నేతలు అందరూ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు. పార్టీలు, సంఘాలకు అతీతంగా పలు చోట్ల జెండా ఆవిష్కరణలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇలాంటి రోజు కోసం ఇదే నేల.. 12 ఏళ్ల క్రితం ఉద్యమాలతో దద్దరిల్లింది. ఎందరో ప్రాణత్యాగాలతో అశువులు బాసింది. స్వరాష్ట్ర సాధనలో కరీంనగర్, వరంగల్, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ముఖ్య భూమి పోషించాయి. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక ఘట్టాలకు కేంద్రంగా మారాయి. తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, సిటీ కాలేజీ విద్యార్థుల పోరాటాలు, శ్రీకాంతాచారి ఆత్మార్పణ, మానవహారం, మిలియాన్ మార్చ్ వంటి ఎన్నో ఘటనలు నేటి సంతోషాలకు బీజం వేశాయి. స్వరాష్ట్ర సాధనకు మార్గంగా మారాయి. 2014 జూన్ 2తో తెలంగాణ కల సాకారమైంది.
మలి దశ ఉద్యమంలో కీలక ఘట్టం ఇదే..
2001లో తెలంగాణ మలి దశ ఉద్యమం ప్రారంభమైంది. అదే సంవత్సరం ఏప్రిల్ 27 న అధికారికంగా తెలంగాణా రాష్ట్ర సమితిని ఏర్పాటుతో కీలక మలుపు తిరిగింది. ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా జై తెలంగాణా, నవ తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ నగారా, తల్లి తెలంగాణ వంటి పార్టీలు ఏర్పడినా తెలంగాణ రాష్ట్ర సమితి బలోపేతంగా మారింది. అంతేకాదు.. రాష్ట్ర ఏర్పాటు కోరుతూ 50 సంవత్సరాల నుంచి పలు ఉద్యమాలు జరుగుతూనే ఉన్నా, 2001 లో తీవ్ర రూపం దాల్చింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009, నవంబరు 29న దీక్షా దివస్ పేరుతో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. మలిదశ ఉద్యమంలో ఇది కీలక ఘట్టంగా చెప్పొచ్చు. స్వరాష్ట్రం కోసం 2009 డిసెంబరు 3వ తేదీన కాసోజు శ్రీకాంతాచారి ప్రాణ త్యాగంతో ఉధృతంగా మారింది. దీంతో ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణసమితి ఆధ్వర్యంలో వివిధ ఉద్యమాలని రూపొందించారు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చి, కేసీఆర్ ఆమరణ దీక్ష వంటి కీలక ఉద్యమ ఘట్టాలతో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణను ప్రకటించాల్సి వచ్చింది.
వీరుల ప్రాణత్యాగం.. స్వరాష్ట్ర ఫలం
ప్రత్యేక తెలంగాణ ప్రకటన వెనుక ఎందరో ప్రాణత్యాగం ఉంది. మరెందరో లాఠీదెబ్బలు తిన్నారు. అనేక మంది జైలుపాలయ్యారు. ప్రధానంగా కానిస్టేబుల్ కిష్టయ్య, కాసోజు శ్రీకాంతచారి, సిరిపురం యాదయ్య, మీగడ సాయికుమార్ యాదవ్, ఇశాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి వంటి రాష్ట్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు. ఎందరో సాగించిన సుదీర్ఘ పోరాటం చివరకు ఫలించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత, 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఆవిర్భవించింది. ఆ రోజు మన కల నెరవేరింది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నింగికెగిరింది. అందుకే జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ నేల నేడు అమరులను స్మరించుకుంటోంది. జై తెలంగాణ.. జైజై తెలంగాణ అని నినదిస్తోంది.
…………………………………………………………..
