
* ఇబ్బందులు పడుతున్న పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల,మండలాల ప్రజలు
*నిరుపయోగంగా పాలకుర్తి పోస్లుమార్టం గది
* పాలకుల నిర్లక్ష్యంపై ప్రజల అసహనం
ఆకేరు న్యూస్, జనగామః ప్రమాదాల్లో తమవారి ప్రాణాలను కోల్సోయి పుట్టెడు శోఖంలో ఉండే కుటుంబ సభ్యులకు పోస్టుమార్టం మరింత శోఖాన్నిమిగిల్చుతోంది. అరకొర బతులకు.. అసలే ప్రమాదాలతో మృత్యువాత పడుతున్న కుటుంబసభ్యులు.. అపై పోలీసుల కేసులు ఇవ్వన్నీ ఒక ఎత్తైతే చచ్చిన శవానికి పోస్టుమార్టం చేయిండచం ఒక ఎత్తుగా మారుతోంది పాలకుర్తి ప్రాంత ప్రజల దుస్థితి. ఇంతకీ ఏమిటా దుస్థితి.. ఎందుకా ఆ పరిస్థితి.. ఎమిటా ఆ పోస్టుమార్టం వ్యథ.. ఒకసారి ఈ గాథ ఏందో చూద్దాం. పాలకుర్తి సర్కిల్ పరిధిలోని కొడకండ్ల, దేవరుప్పుల, పాలకుర్తి మండలాల పరిధిలో ఏమైనా ప్రమాదాల్లో మరణించినా, ఏదైనా అనుకోని విపత్తుల్లో చనిపోయినా,ఎవరైనా ఎలాంటి ఆఘాయిత్యం చేసుకుని మృత్యువాత పడినా వారిని పోస్టుమార్టం చేసేందుకు జనగామ దవాఖానాకు తీసుకుపోవాల్సిందే. ప్రమాదాల్లో చనిపోవడం ఒక ఎత్తు అయితే.. వారికి పోస్టుమార్టం కోసం జనగామకు తరలించడం మరోఎత్తుగా మారింది. జనగామకు తరలించాలంటే వ్యయ ప్రయాసాలకు, మానసిక క్షోభకు కుటుంబ సభ్యులు గురవుతున్నారు. ఈ ఇబ్బందుల నుంచి తొలగించాలని ఈ ప్రాంత ప్రజలకు అనుకూలంగా ఉండేందుకు పాలకులు ప్రయత్నించారు. పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను 30 పడకల ఆస్పత్రి చేసిన తరువాత గత మూడు దశాబ్దాల క్రితం పోస్టుమార్టం చేసేందుకు సర్కారు ఓ ప్రత్యేక గదిని నిర్మాణం చేసింది. పోస్టుమార్టంకు కావాల్సిన వస్తువులను ప్రభుత్వం సమకూర్చింది. అయితే పాలకులు పోస్టుమార్టం గదిని నిర్మించారు.. వస్తువులు సమాకూర్చారు తప్పితే పోస్టుమార్టం చేసేందుకు డాక్టర్ను, సిబ్బందిని నియమించలేదు. దీంతో ఆ పోస్టుమార్టం గది ఎలాంటి సేవలు అందించకుండానే శిథిలమైపోయింది. పాలకుల చిత్తశుద్దిలేని పనితో అదికాస్తా అక్కరకు రాకుండా పోయింది. పోస్టుమార్టం గదిని నిర్మిస్తే ఈ ప్రాంత ప్రజలు పోస్టుమార్టం కష్టాలు తప్పాయని ఆశపడితే.. అది అడియాశగానే మిగిలిపోయింది. ఇక మరోసారి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మరో పోస్టుమార్టం గదిని మంజూరు చేపించి, నిర్మాణం చేయించారు. మరోసారి లక్షలాది రూపాయలు విలువ చేసే పరికరాలు తెప్పించారు. ఆర్బాటంగా.. అట్టహాసంగా దానిని ప్రారంభించారు.. మళ్ళీ పోస్టుమార్టంపై ఈ ప్రాంత ప్రజలు ఆశలు చిగురించాయి.. కానీ మళ్ళీ అదే నిరాశ.. నిశ్పృహ. డాక్టర్లను నియమించలేదు.. సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. దీంతో నిర్మాణం చేసి, ప్రారంభించిన గది నిరుపయోగంగానే ఉంది.. లక్షలాది రూపాయలు వెచ్చించి తెచ్చిన పరికరాలు తుప్పు పడుతున్నాయి తప్పితే ప్రయోజనం లేని పోస్టుమార్టంగా మారింది. మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్రావు పోస్టుమార్టం నిర్మాణం చేయించడంలో చేసిన కృషి.. సిబ్బందిని, డాక్టరు ను నియమించడంలో.. దానిని ఉపయోగంలోకి తేడవంలో మాత్రం కృషి చేయలేక పోయాడని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మరోసారి పోస్టుమార్టంపై ఈ ప్రాంత ప్రజల, పోలీసుల ఆశలు చిగురిస్తున్నాయి. 30 పడకల నుంచి 50 పడకలకు దావాఖాన అప్గ్రేడ్ అవుతున్నందున పోస్టుమార్టం ఉపయోగంలోకి తెస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తుందనే ఓ చిన్నపాటి ఆశ. ఈ పోస్టుమార్టం గదిని ఉపయోగించి ఇక్కడే పోస్టుమార్టం చేస్తే పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల ప్రాంత ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, పోలీసులకు శ్రమ తప్పుతుందని, మానసిక క్షోభ నుంచి విముక్తి కలుగుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి పాలకులైనా పోస్టుమార్టం ను అందుబాటులోకి తెస్తారని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు.
………………………………………..