
* కవితకు తెలియకుండానే ఇంత అవినీతా?
* కేసీఆర్ విడిచిన బాణం కవిత..
* ఆ బాణం హరీశ్‌రావు వైపు ఎందుకు వెళ్లిందో..!
* టీపీసీసీ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ నుంచి సస్పెన్షన్ తో ఆ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గులాబీ కీలక నేతలు హరీశ్‌రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. వారు పెద్ద అవినీతి తిమింగలాలని, కోట్లకు కోట్లు కూడబెట్టుకున్నారని అన్నారు. ప్రెస్ మీట్లో కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందించారు. కవిత కొన్ని కఠోర వాస్తవాలను వెల్లడించారని, అదే సమయంలో అసత్యాలనూ తెలిపారని అన్నారు. ఆమె కేసీఆర్ విడిచిన బాణం అనుకున్నామని, అయితే ఆ బాణం హరీశ్‌రావు వైపు ఎందుకు వెళ్లింది అనేది తెలియట్లేదన్నారు. కేసీఆర్ బిడ్డ కవిత స్టాండ్ ఎందుకు మారిందో అర్ధం కావడం లేదన్నారు. అవినీతిపై మాట్లాడిన కవిత.. ఆమెకు తెలియకుండానే ఇంతకాలం అవినీతి జరిగిందా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నంత కాలం అవినీతిలో భాగస్వాములై.., ఇప్పుడు తాను తప్ప అందరూ అవినీతికి పాల్పడినట్లు మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. దొంగల ముఠా మధ్య పంపకాల్లో తేడాలు వచ్చాయని.. అందుకే కవిత బయటపడ్డారన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కథ ముగిసినట్టే అన్నారు. తన వరకు వస్తే కానీ, కవితకు బీఆర్ ఎస్ పాలన ఎలా జరిగిందో అర్థం కాలేదన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ ఎస్ కనుమరుగు కావడం ఖాయమని, చచ్చిపామును ఇంకా చంపే తీరిక లేదని మహేశ్‌గౌడ్ అన్నారు.
…………………………………………..