ఆకేరు న్యూస్, డెస్క్ : భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (Justice BR Gavai) ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (MURMU) ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(MODI), పలువురు కేంద్ర మంత్రులు, ఉప రాష్ట్రపతి, ఇతర అతిథుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 లో జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 2003 నవంబరు 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 నవంబరు 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొంది పలు ధర్మాసనాల్లో సేవలందించారు. గత ఆరేళ్లలో జస్టిస్ గవాయ్ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వాములయ్యారు. ఇక 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా ఏప్రిల్ 16వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. సీజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తిగా గవాయ్ పేరు పొందారు. గవాయ్ సీజేఐ(CJI)గా ఆరు నెలలు కొనసాగి నవంబరు 23న పదవీ విరమణ చేయనున్నారు.
………………………………………………
