
* హాజరైన ఇండియా కూటమి నేతలు
ఆకేరు న్యూస్ డెస్క్ : ఇండియా కూటమి తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సెక్రటరీకి అందజేశారు. నామినేషన్ కార్యక్రమానికిఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తో పాటు సోనియా గాంధీ,రాహుల్ గాంధీ ఇతర ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. 1946 జూలై 8 న రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంలో రైతు కుటుంబంలో జన్మించిన సుదర్శన్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుండి న్యాయ శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు.1971లో బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయవాది కె. ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో సివిల్, రాజ్యాంగపరమైన విషయాలపై ప్రాక్టీస్ ప్రారంభించారు 1988, ఆగస్టు 8న హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్‌గా, కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 1993లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ న్యాయ సలహాదారుగా పని చేశారు. 1993 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తి అయ్యారు. 2005 డిసెంబరు 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007, జనవరి 12న సుప్రీంకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, 2011 జూలై 8న పదవీ విరమణ పొందారు .2013 లో మొదటి గోవా లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించారు, ఆ తరువాత వ్యక్తిగత కారణాలతో 2013 అక్టోబరులో ఆ పదవికి రాజీనామా చేశారు. న్యాయ నిపుణుడుగా న్యాయకోవిదుడుగా సుదర్శన్ రెడ్డికి విశేషమైన అనుభవం ఉంది
……………………………….