* ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Kadiyam Srihari| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: తెలంగాణ ప్రజల జీవన విధానం నుంచి పుట్టిన ప్రకృతి పండుగ బతుకమ్మ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకృతిని దైవంగా భావించి పూజించే అరుదైన సంప్రదాయం తెలంగాణకు ప్రత్యేకమని కడియం శ్రీహరి కొనియాడారు. దేవతలకు అర్చించే పూలనే బతుకమ్మగా పేర్చి పూజించడం ప్రకృతి పట్ల తెలంగాణ ప్రజలకు ఉన్న ఆరాధన, కృతజ్ఞతా భావాలకు నిదర్శనమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.
తొమ్మిది రోజుల పాటు ప్రకృతితో మమేకమై సాగిన బతుకమ్మ వేడుకలతో పల్లెలు, పట్టణాలు ఆటపాటలతో సాంస్కృతిక శోభను సంతరించుకున్నాయని అన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకల అనంతరం విజయాలను అందించే విజయదశమి (దసరా) పండుగను స్వాగతించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పండుగ వేడుకల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
బతుకమ్మ నిమజ్జనం సమయంలో ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని జగన్మాత గౌరీదేవిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

