* కుక్కలు, పాములు, ఎలుకలతో సహజీవనం
* భయం నీడన విద్యార్థినులు
* అధికారులు పట్టించుకోవడం లేదు
* విద్యార్థినుల ఆవేదన
ఆకేరు న్యూస్, హనుమకొండ : కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) మహిళా హాస్టల్ విద్యార్థులు దిన దిన గండంగా బ్రతుకు వెళ్ళదీస్తున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం పేద , మద్యతరగతి విద్యార్థుల సరస్వతీ నిలయంగా భావిస్తారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అని ఇక్కడ చదువుకోవడానికి వస్తే ఇబ్బందుల పాలవుతున్నామంటున్నారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* మహిళా హాస్టల్లో కుక్కల స్వైర విహారం
మహిళా హాస్టల్లంటే మరింత రక్షిత ప్రదేశంగా ఉండాలి. బిక్కు, బిక్కు మంటూ కాలంగడిపే పరిస్థితి వల్ల చదువుపై ధ్యాస పెట్టలేక పోతున్నారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద విద్యాకేంద్రంగా ఉన్న వరంగల్‌లో ని కాకతీయ విశ్వవిద్యాయలంలోని మహిళా హాస్టల్ల లో విద్యార్థులు భయం నీడన బ్రతుకుతున్నారు. హాస్టల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రక్తం ఓడుతూ రోగాల బారిన పడిన కుక్కలు ఏకంగా అమ్మాయిల బెడ్ల మీదకే వచ్చేస్తున్నాయి. వాటిని బయటకు వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిస్తే తమ మీద దాడి చేస్తున్నాయని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాచ్ మెన్ వాటిని తరిమేసేందుకు ప్రయత్నిస్తే అతని మీద కూడా దాడిచేశాయంటున్నారు. బాత్ రూమ్‌లు, బెడ్ రూమ్‌లు హాల్ ఏదైనా కుక్కలు యధేచ్చగా వస్తుంటాయి. ప్రతి రోజు రాత్రి పదుల సంఖ్యలో కుక్కలు పరస్పరం దాడులు చేసుకుంటూ అరుపులతో బీభత్సాన్ని సృష్టిస్తున్నాయంటున్నారు. రాత్రంతా కుక్కల అరుపులతోనే చదువుకోలేక నిద్ర పోలేక సతమతమవుతున్నామంటున్నారు. రోగాల పాలైన కుక్కలు కరిస్తే రేబిస్ బారిన పడాల్సి వస్తుందేమేనన్న భయం అమ్మాయిలను వెంటాడుతోంది.
* పాముల వీర విహారం
కుక్కలే కాదు పాములు కూడా హాస్టల్ ప్రాంగణంలో వీర విహారం చేస్తుంటాయి. ఇటీవలే ఒక భారీ పాము హాస్టల్ పరిసరాల్లో సంచరించడంతో అమ్మాయిలు బెంబేలెత్తి పోయారు. వీడియో తీసి విశ్వవిద్యాలయ అధికారులకు పంపించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందంటున్నారు. బయటి నుంచి ఉన్న రంధ్రాల నుంచి ఏకంగా పాములు బాత్ రూమ్, బెడ్ రూమ్‌ల్లోకి వస్తున్నాయంటున్నారు. ఈ భయం వల్ల రాత్రి పూట అస్సలు బాత్ రూమ్‌కు వెళ్ళాలన్న వెళ్లలేని దుస్థితి ఏర్పడిందంటున్నారు.
* ఎలుకలు కాలి వేళ్ళను తింటున్నాయి
కుక్కలు, పాములతో పాటు ఎలుకలు కూడా తమ మీద దాడి చేస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.
రాత్రి పూట నిద్ర పోతున్న వారి కాలి వేళ్లను కొరికేస్తున్నాయంటున్నారు.రక్తం కారుతున్న కాళ్ళతో రాత్రంతా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయంటున్నారు. హాస్టల్ మాదో కుక్కలు , పాములు ఎలుకలదో అర్థం కావడం లేదంటున్నారు.
* అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు
ఎన్ని సార్లు హాస్టల్ అధికారులకు, వైస్ చాన్స్‌లర్‌కు చెప్పిన పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే ఏదో రోజు కుక్కలకు , పాములకు , ఎలుకలకు బలి కావాల్సి వస్తుందని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
* కుక్కలు బెడ్ పైనే పడుకుంటున్నాయి
ఇక్కడ మా హాస్టల్ లో కుక్కలు విపరీతంగా ఉన్నాయి, ప్రతిసారి రూమ్ డోర్ పెట్టుకోవడం కుదరదు కదా అలా తెరచి ఉన్న సందర్భంలో కుక్కలు వచ్చి మా బెడ్ పైనే పడుకుంటున్నాయి.. రోగాలకు గురైనటువంటి కుక్కలే మా హాస్టల్ లో ఎక్కువగా ఉన్నాయి.. అలాంటి కుక్కల ద్వారా మాకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా.. అలాగే కొంతమందికి స్టూడెంట్స్ కి ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ కూడా మొదలైనాయి.. అంతే కాకుండా ఈ ఏరియాలో పాములు కూడా ఎక్కువగా తిరుగుతున్నాయి.. మేము ఇంతకుముందు ఈ విషయాల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. వాళ్లు కుక్కలను పట్టుకెళ్ళాము అని అంటున్నారు కానీ ఎక్కడికి కుక్కలు అక్కడే కనబడుతున్నాయి. వాటికి కూడా ఇదే హాస్టల్ అయింది..మేము కారిడార్ లో బట్టలు ఆరవేసుకుంటే వాటిని కుక్కలు కిందపడేసి చింపివేయడం ఇంకా ఎక్కడికో పట్టుకెళ్ళడం చేస్తున్నాయి.. ఆల్రెడీ బాత్రూం ఏరియా క్లీన్ గా ఉండదు అలాంటి ప్లేసెస్ లో కూడా కుక్కలు ఉంటున్నాయి మేము బాత్రూం యూస్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.. ఇక్కడ ఉన్న కుక్కలు అన్ని వ్యాధి సోకినవే ఎక్కువగా ఉన్నాయి.
* కుక్కల అరుపుల వల్ల రాత్రి నిద్ర పోలేకపోతున్నాము
ఉపయోగించి పడేసిన శానిటరీ నాప్కిన్స్ కాలబెట్టగా అసంపూర్తిగా కాలిన వాటిని బయటికి తీసుకొచ్చి రోడ్ల మీద పడేస్తున్నాయి. చర్మవ్యాధులు వచ్చిన కుక్కలు కాబట్టి వాటి వలన మాకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలం ఎక్కువ వ్యాధులు వస్తాయి. రాత్రి 11 గంటల నుంచి తెల్లారే వరకు అవి అరుస్తూనే ఉంటాయి వాటి అరుపుల వల్ల నిద్ర పోలేకపోతున్నాము. విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలు కారిడార్ మొత్తాన్ని అపరిశుభ్రం చేస్తున్నాయి, రూం నుంచి బయటికి రాలేకపోతున్నాము.
*హాస్టల్ గదుల్లో కుక్కలు మూత్రవిసర్జన చేస్తున్నాయి
హాస్టల్ గది తలుపులు తెరిచిన ఐదు నిమిషాల్లోనే కుక్కలు లోపలికి వచ్చి బెడ్ పైన పడుకుంటున్నాయి. మేము కొట్టడానికి ప్రయత్నం చేస్తే మమ్మల్ని కరవడానికి వచ్చాయి, భయంతో వాచ్ మెన్ ని పిలిచాము తనని కూడా కరవడానికి మీదికొచ్చింది. హాస్టల్లో కుక్కలే కాకుండా పాములు కూడా తిరుగుతున్నాయి చాల భయంగా ఉంటుంది.
హాస్టల్ గదుల్లో కుక్కలు మూత్రవిసర్జన చేస్తున్నాయి ఊడ్చేవాళ్ళు సరిగా శుభ్రం చేయట్లేదు.
*మాలో కొంతమందివ పాదాలు ఎలుకలు కొరికి తిన్నాయి
హాస్టల్ స్నానాల గదుల్లో పాములు తిష్టవేస్తున్నాయి, రాత్రి సమయంలో వాష్ రూమ్ పోవాలంటే భయంగా ఉంది. ప్రతిసారి అప్రమత్తంగా ఉండలేము కదా, అవి కాటేస్తే మా పరిస్థితి ఏం కావాలి. కుక్కలు పాముల వల్ల బిక్కు బిక్కుమంటూ ఉంటున్నాం. ఇక్కడ ఎలుకలు తిరుగుతున్నాయి చాలామందిని ఎలుకలు కరిచాయి, మాలో కొంతమందివి పాదాలు కొరికి తిన్న సంఘటనలు ఉన్నాయి.
*ఎటునుంచి ఏ పాము గదిలోకి వస్తదో అని భయంగా బ్రతుకుతున్నాం.
కేయూ కి వచ్చి 6 నెలలు అవుతుంది. మాకు ఇక్కడ కుక్కల సమస్య ఎక్కువగా ఉంది. చర్మ సమస్య తో ఉన్న కుక్కలు ప్రతి గది కి వస్తాయి. చూడటానికి చాలా భయంగా ఉంటాయి ఎప్పుడు వస్తాయో అనే బయం భయం తో బ్రతుకుతున్నాం. మేము ఈ చర్మవ్యాధి కుక్కల తో ఉండాల్సి వస్తుంది. నేను చదువుకునే నోట్ బుక్ నీ కూడా చింపేసాయి. నా స్నేహితురాలిది ఫోన్ చార్జర్ కూడా కొరికి పడేసింది. మేము బయట చదువుకునే ప్లేస్ లో కుక్కలు మూత్రవిసర్జన చేస్తున్నాయి. ఆ వాసనకి గదిలో ఉండలేకపోతున్నాం. మళ్ళీ మెస్ లోకి వస్తాయి. ఈ హాస్టల్ ఫుడ్ తినడమే ఎక్కువ అంటే మెస్ లో కుక్కలను చూస్తే అస్సలు అన్నమే తినాలని అనిపించదు. మా హాస్టల్ చుట్టూ పరిశుభ్రంగా లేకపోవడంతో పాములకు నివాసం కూడా ఇక్కడే అయ్యింది. ఎటునుంచి ఏ పాము గదిలోకి వస్తాదో అని భయంగా బ్రతుకుతున్నాం.
——–