ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి- కల్వకుంట్ల కవిత డిమాండ్
ఎస్సీ ఉప కులాల నేతలతో సమావేశం…
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల (SC) జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని, ఈ మేరకు ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వం తీర్మానం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో సుమారు 20 ఎస్సీ ఉప కులాల ప్రతినిధులతో ఆమె ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
గతంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు, ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కుల గణన గణాంకాలను పరిశీలిస్తే ఎస్సీల జనాభా 15 శాతం నుండి 18 శాతానికి పెరిగినట్లు స్పష్టమవుతోందని కవిత పేర్కొన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ఫలాలు అందాలంటే, వాటిని 18 శాతానికి పెంచడం అనివార్యమని ఆమె స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ మరియు రిజర్వేషన్ల అంశంపై మాట్లాడుతూ, కవిత కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు.. కేవలం విద్య, ఉద్యోగాలకే పరిమితం కాకుండా, రిజర్వేషన్ల ప్రయోజనాలు అన్ని ఉప కులాలకు సమానంగా అందాలి. ఎస్సీ ఉప కులాలకు రాజకీయాల్లోనూ తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. కొన్ని ఉప కులాలకు కుల ధ్రువీకరణ పత్రాల (Caste Certificates) జారీలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.
“కేంద్ర జనగణన తర్వాతే రిజర్వేషన్ల పెంపు ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ, రాష్ట్ర స్థాయి గణాంకాల ఆధారంగా ఇప్పుడే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి అని కల్వకుంట్ల కవిత అన్నరు…ఎస్సీ ఉప కులాల హక్కుల సాధన కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జాగృతి దళిత సంఘాలతో కలిసి క్షేత్రస్థాయిలో పోరాడుతుందని కవిత హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వివిధ ఉప కులాల నేతలు తమ సామాజిక, ఆర్థిక స్థితిగతులపై చర్చించారు.
