– ఎంపీడీవో గుండె బాబు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : ఉపాధి హామీ పని కల్పించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు అన్నారు. మండలంలోని శంభునిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకంలో నిర్వహిస్తున్న నర్సరీని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హామీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతీ గ్రామంలో, ప్రతి రోజు కనీసం 50 మంది కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని, మండల వ్యాప్తంగా 7000 ఉపాధి హామీ పని దినాలను కల్పించాలని ఆదేశించారు. రెండు రోజులలో అన్ని గ్రామాలలో నర్సరీలకు ఎర్ర మట్టి తెప్పించి, ఆయా గ్రామానికి నిర్దేశించిన విధంగా బ్యాగులు నింపి, విత్తనాలు వేసి, 15 రోజులలో ప్రతి బ్యాగులో మొక్క మొలచి ఉండే విధంగా చూసుకోవాలని , నర్సరీలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. లేని పక్షంలో దానికి కారణమైనటువంటి పంచాయతీ కార్యదర్శి గాని, ఉపాధి హామీ సిబ్బంది గానీ ఎవరినైనా ఉపేక్షించేది లేదని కఠినంగా హెచ్చరించారు. కార్యక్రమంలో శంభునిపల్లి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ మోడెం తిరుపతి ,వన సేవకులు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
……………………………………………
