*కంగనా రనౌత్ పిటిషన్ ను కొట్టి వేసిన ధర్మాసనం
ఆకేరు న్యూస్ డెస్క్ : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హడావుడి చేసే నటి బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో 2021లో రైతులు చేసిన ఆందోళనపై కంగనా రనౌత్ వివాదాస్పద ట్వీట్ చేశారు. కాగా, 2021లో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల ఆందోళన సందర్భంగా మహిందర్ కౌర్ అనే వృద్ధ మహిళను కించపర్చేలా నటి కంగనా ట్వీట్ చేశారు. ఆమె రూ. 100 కిరాయికి వస్తుందని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహిందర్ కౌర్ కంగనాపై పరువునష్టం కేసు వేశారు. ఆమె చేసిన ట్వీట్ రైతుల మనోభావాలు దెబ్బతీశాయంటూ పంజాబ్ లో ఆమెపై క్రిమినల్ కేస్ నమోదైంది.ఆ కేసును రద్దు చేయాలంటూ కంగనా హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. కానీ, కోర్టు ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. అనంతరం ఆమె హర్యానా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, అక్కడ కూడా ఆమెకు ఊరట దక్కలేదు. కంగనా పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అప్పటికే ఉద్రిక్తతలో ఉన్న పరిస్థితికి కంగనా తన ట్వీట్‌తో అగ్నికి ఆజ్యం పోశారంటూ ధర్మాసనం కంగనా పిటిషన్‌ను తోసిపుచ్చింది.
………………………………….
