* మరోసారి తెరపైకి ప్రత్యేక కళ
* ఇక్కడి కళాకారులకు అంతర్జాతీయ అర్డర్లు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ఈ ఆదివారం జరిగిన మన్ కీ బాత్ లో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్ గురించి ప్రస్తావించడంపై కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి ఇక్కడ కళ ప్రత్యేకత తెరపైకి వచ్చింది. విదేశీ పర్యటనలు వెళ్లినప్పుడు, పలు దేశాల ప్రధానులకు కరీంనగర్ వెండి ఆకృతులనే బహుమతులుగా అందించినట్లు మోదీ తెలిపారు. ఎవరికి ఏం ఇచ్చారో కూడా తెలిపి ఆశ్చర్యానికి గురి చేశారు. వెండితో చేసిన బుద్ధుడి ప్రతిమను జపాన్ ప్రధానికి ఇచ్చినట్లు గుర్తు చేశారు. పూల ఆకృతితో చేసిన వెండి అద్దాన్ని ఇటలీ ప్రధానికి ఇచ్చానన్నారు. దీంతో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళ మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందింది. ఈక్రమంలో ఈ కళపై ఆకేరు న్యూస్ ప్రత్యేక కథనం..
ప్రపంచ వ్యాప్త గుర్తింపు
కరీంనగర్ ఫిలిగ్రీ హస్త కళకు ఎప్పటి నుంచో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక్కడి తయారుచేసే ఆభరణాల కోసం కళాకారులకు దేశ, విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తాయి. వీరి హస్త కళా నైపుణ్యం, విభిన్న కళాకృతులు, తయారీలో నేర్పరితనంతో వెండి ఆభరణాలు ప్రత్యేక ఆభరణాలు పొందుతున్నాయి. నగర శివార్లలోని ఎలెగండ్లలో ఫిలిగ్రీ కళ ప్రారంభమైనట్లు స్థానికులు చెబుతుంటారు. కరీంనగర్ కళాకారులు అధిక నాణ్యత కలిగిన గొప్ప మరియు సంక్లిష్టమైన రచనలను రూపొందించారు. ఈ కళకు దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు అధ్యయనకారులు పేర్కొంటున్నారు. అయితే కాలక్రమేణా ఈ కళకు శోభ తగ్గుతూ వస్తోంది. అయితే.. చేతివృత్తుల కుటుంబాలకు చెందిన కొంతమంది యువకులు 2008లో ప్రధానమంత్రి ఉపాధి హామీ కార్యక్రమం కింద సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ (SIFKA) హ్యాండిక్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీని తిరిగి స్థాపించి మరోసారి కళను జీవం పోశారు. ఆ యువకులు దాదాపు 100 మంది నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు.
లండన్ మ్యూజియంలో కరీంనగర్ కళాకృతులు
దేశ, విదేశాల్లో ప్రముఖుల నుంచి కూడా తమకు ఆర్డర్లు వస్తున్నాయని ఆ సొసైటీ నిర్వాహకులు పేర్కొంటున్నారు. బహుళ జాతి కంపెనీలు కూడా కరీంనగర్ కళాకారులకు ఆర్డర్లు ఇస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ చీఫ్ బిల్ గేట్స్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఇక్కడకు వచ్చినప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు జ్ఞాపికగా ఇచ్చిన వెండి గ్లోబ్ కరీంనగర్ కళాకారులు తయారు చేసినదే.గతంలో నైపుణ్యం ఉన్న ఇక్కడి కళాకారులు తయారు చేసిన వెండి ఫిలిగ్రీ వస్తువులు లండన్లోని స్టేట్ హెరిటేజ్ మ్యూజియంలో కూడా ప్రదర్శనలో ఉన్నాయి. కొన్ని వస్తువులు హైదరాబాద్లోని సాలార్ జంగ్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉన్నాయి.
……………………………………………….
