* మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
ఆకేరు న్యూస్, కరీంనగర్ : క్యాన్సర్ కు భయపడాల్సిన అవసరం లేదని, ముందస్తు పరీక్షల ద్వారా దీన్ని అధిగమించవచ్చని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని ఆల్ఫ్రెడ్ నోబెల్ పాఠశాలలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో మహిళ ఆరోగ్యం- క్యాన్సర్ స్ర్కీనింగ్ పేరిట నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సత్తు మల్లేశంతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ చాపకింద నీరులా క్యాన్సర్ విస్తరించడం ఆందోళన కలిగించే విషయమే అయినప్పటికీ దీని అదుపు చేయడం కష్టమేమీకాదన్నారు. ప్రజల జీవితాలకు ముప్పుగా పరిణమిస్తున్న క్యాన్సర్ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధి లక్షణాలను గుర్తించి ముందస్తు చర్యలపై దృష్టి సారించాలన్నారు. వ్యాధి ముదిరిన తర్వాత గుర్తించడం వల్ల చికిత్స కష్టమవుతుందని ఆయన చెప్పారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ వ్యాధిని ఎదుర్కోవచ్చన్నారు. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ విషయంలో మహిళలు నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ, క్యాన్సర్ నివారణ, ఆధునిక చికిత్సలపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలను విరివిగా నిర్వహించాల్సిన అవసరం ఉందంటూ ఈ వైద్య శిబిర నిర్వాహకులను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి అభినందించారు.
…………………………………….
