Kavitha new party Telangana
* వ్యూహం మారుస్తున్న కవిత: రిటైర్డ్ అధికారులతో భేటీ.. ఆ 25వ తేదీన కీలక ప్రకటన?
* బంజారా గడ్డపై కవిత పొలిటికల్ స్కెచ్: కొత్త పార్టీలో గిరిజనులకే అగ్రపీఠం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం బంజారా సమాజానికి చెందిన కీలక నేతలు, రిటైర్డ్ ఉన్నతాధికారులతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్లోని రిటైర్డ్ అడిషనల్ డీజీ డీటీ నాయక్ నివాసంలో జరిగిన ఈ సమావేశం, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది.
* కొత్త రాజకీయ వేదిక.. బంజారాలకు ప్రాధాన్యం..
ఈ నెల 25న కవిత సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గంలో బంజారా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తాము స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీలో బంజారా సమాజానికి సముచిత స్థానం కల్పిస్తామని, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని కవిత హామీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకునే బంజారా విద్యావంతులు, యువతకు తమ పార్టీ స్వాగతం పలుకుతుందని ఆమె స్పష్టం చేశారు.
* మేధావుల సూచనలతో ముందుకు..
బంజారా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, గిరిజన తండాల అభివృద్ధి, మరియు రాజకీయ భాగస్వామ్యంపై రిటైర్డ్ ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులతో ఆమె సుదీర్ఘంగా చర్చించారు. కొత్త పార్టీ విధివిధానాల రూపకల్పనలో బంజారా మేధావులు చురుకైన పాత్ర పోషించాలని, తగిన సలహాలు, సూచనలు అందించాలని ఆమె కోరారు.
తెలంగాణ జాగృతి ద్వారా ఇప్పటికే సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం కృషి చేస్తున్న కవిత, ఇప్పుడు రాజకీయంగా కూడా బంజారా హృదయాలను గెలుచుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.
