
* పండిన పంటలు, పండిరచిన రైతులే దీనికి సాక్ష్యం
* అబద్దాలు చెప్పడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది
* మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ఆకేరున్యూస్, వనపర్తి: పచ్చబడ్డ పాలమూరుకు చిరునామా కేసీఆర్ అని, పండిన పంటలు పండిరచిన రైతులే దీనికి సాక్షమని రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్ తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.వెయ్యి లేదా రూ.1200 కోట్ల నిధులు ఇచ్చి నాలుగైదు నెలలు పనిచేస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయి రైతాంగానికి సాగునీరు అందుతుందని, పాలమూరు రంగారెడ్డి పనులు ఆపి ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని, పాలమూరును పూర్తి చేసి నిబద్దత, చిత్తశుద్దిని చాటుకోవాలని అన్నారు. అబద్దాలు చెప్పడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని, ప్రభుత్వ సభకు, పార్టీ సభకు తేడా తెలియని వారు మన పాలకులు కావడం దౌర్భాగ్యమని, కేసీఆర్ ను తిట్టాలి అనుకుంటే పార్టీ సభ పెట్టుకో .. ఎలాగూ తిట్టడానికే కదా సభలు పెట్టేదని ఆయన హితవు పలికారు.
చెప్పిందేంటి, చేయాల్సిందేమిటో వదిలేసి వెళ్లిన చోటల్లా అబద్దాలు చెప్పడమే సీఎం రేవంత్ దినచర్యగా మారిందని, గత ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద అభాండాలు వేయకపోతే రేవంత్ దినం గడవడం లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటింది. అయినా కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడం మీద, పాలన మీద దృష్టి పెట్టడం లేదని అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ప్రతి విషయానికి విదేశీహస్తం అని ఆరోపణలు చేసేవారు .. తర్వాత అది హస్యాస్పదంగా మారి పత్రికల్లో కార్టూన్లు వచ్చే పరిస్థితి ఏర్పడిరదని, దేశానికి స్వాతంత్య్రం వచ్చింది అంతిమంగా మహాత్మాగాంధీ నాయకత్వం వహించిన తర్వాతనే ..అందుకే ఆయన జాతిపిత అయ్యాడు .. స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మాగాంధీ ఆరేళ్లు జైలు జీవితం గడిపితే .. జవహర్ లాల్ నెహ్రూ తొమ్మిదిన్నరేళ్లు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు.
నెహ్రూ ప్రధాని అయిన తర్వాత ఆయన హయాంలో దేశంలోని అనేక అంశాలలో వారి పాత్ర విస్మరించలేనిదని, దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వారు గాంధీ మహాత్ముడు, జవహర్ లాల్ నెహ్రూను ఎంతో చిన్నగా చేసి చూయిస్తున్నారు ..స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పాత్ర లేదు కాబట్టి తమను తాము పెద్దగా చేసుకోవడానికి గాంధీ, నెహ్రూలను చిన్నగ చేసి చూయిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేనివారు, వ్యతిరేక పార్టీలను మోసిన వారు కేసీఆర్ ను చిన్నగ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్లనే అని ఏపీ ప్రజలే చెబుతారని, ప్రతి దానికి కేసీఆర్ ను నిందిస్తే సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తారన్నారు. వనపర్తి పర్యటనలో జిల్లాకు కొత్తగా ఒరిగింది ఏమీ లేదు .. వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు అని డబ్బా కొట్టుకుంటున్నారని, కేసీఆర్ హయాంలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి ..అక్కడ జరిగిన అభివృద్ధి పనులకే తిరిగి శంకుస్థాపన చేయడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తికి మెడికల్ కళాశాల మంజూరు చేశారు ..మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు .. అవి ఇప్పుడు నిర్మాణంలో వివిధ దశలలో ఉన్నాయి ..వాటికి తిరిగి శంకుస్థాపన చేయడం విడ్డూరమని, వెనకటికి ఎన్ని లెంకల వ్యవసాయం అంటే 101 అన్నాడట ..ఏది అని అడిగితే మా దొరది 100 నాది ఒకటి అన్నాడట అని ఆయన ఎద్దేవా చేశారు. రూ.550 కోట్లతో మెడికల్ కళాశాల మంజూరు చేసింది గత ప్రభుత్వం ..కొత్తగా రహదారులు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు శ్రీకారం చుట్టడాన్ని స్వాగతిస్తున్నాం, రూ.21 కోట్లతో ఐటీ టవర్ కు కేటీఆర్ శంకుస్థాపన చేస్తే దాని శిలాఫలకం పగలగొట్టి తిరిగి సీఎంతో శంకుస్థాపన చేయడం సమంజసమా ? అసలు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు ? నిఘా విభాగం అధికారులు ఏం చేస్తున్నారు ? సీఎంఓ అధికారులు ఏం పనిచేస్తున్నారు ? గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన వనపర్తి బైపాస్ రోడ్డు, పెబ్బేరు రోడ్డు పనులను నిలిపివేశారని అన్నారు. రూ,120 కోట్ల ఎస్ డీ ఎఫ్ పనులను నిలిపివేశారు ..దానికి చెందిన అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, వనపర్తికి తలమానికం అయిన రాజప్రసాదాన్ని రాజు రాజా రామేశ్వర్ రావు ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలకు ఇచ్చి అప్పటి ప్రధాని నెహ్రూ ద్వారా ప్రారంభింపచేశారు .. ఆ తర్వాత అది ప్రభుత్వ కళాశాలగా మారిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ఎంతో ప్రాచుర్యం పొందింది .. అక్కడ చదివిన వారు ప్రపంచ దేశాలలో ఉన్నారని, శిథిలావస్థకు చేరిన కళాశాల, కళాశాల వసతిగృహాల నిర్మాణం కోసం కేటీఆర్ తో రూ.22 కోట్లతో శంకుస్థాపన చేశామని, వనపర్తికి జేఎన్ టీయూ ఇంజనీరింగ్ కళాశాల వచ్చి మూడేళ్లు అవుతుంది .. మొదటి దశలో ఏడు కోట్ల పనులు చేపట్టాం ..రెండో దశ పనులను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిందని పేర్కొన్నారు.
దేశంలోనే తొలిసారి బీసీ వ్యవసాయ డిగ్రీ కళాశాలలను కేసీఆర్ను ఒప్పించి కరీంనగర్, వనపర్తిలో ఏర్పాటు చేశాం ..వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టాలను సవరించి వీటిని ఏర్పాటు చేశామని వివరించారు. అది ఇప్పటికీ అద్దె భవనంలోనే కొనసాగుతుంది .. అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా దానికి కనీసం భవనం నిర్మించే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. వనపర్తిలో జరిగిన మార్పులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతనే అన్న విషయం రేవంత్ రెడ్డికి తెలియదా ? అప్పుడు రేవంత్ తిరిగిన రహదారులు ఎలా ఉన్నాయి ? ఇప్పుడు ఎలా ఉన్నాయి ? వనపర్తిలో నిర్మించిన 3200 డబల్ బెడ్రూం ఇండ్లు నిర్మించింది కనిపించలేదా ? కలెక్టరేట్ భవనం, ఎస్పీ కార్యాలయం, వనపర్తి రహదారుల విస్తరణ, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాల నిర్మాణాలు కనిపించ లేదా ? రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా కాకుండా రాజకీయ పార్టీలో రెబల్ కార్యకర్తలా రేవంత్ వ్యవహరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. 2014 తెలంగాణ ఏర్పాటుకు ముందు పాలమూరులో అంతకుముందు జూరాల ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూరు కింద 12 వేల ఎకరాలకు మినహా పాలమూరులోని ఏ ప్రాజెక్టు నుండి సాగునీళ్లు ఇవ్వలేదని, ఆ తర్వాత జొన్నలబొగుడ, గుడిపల్లి పంప్ హౌస్ లు పూర్తి చేసి సాగునీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వంలోనేనని, కాంగ్రెస్ వల్ల దేశానికి, రాష్ట్రానికి నష్టం జరిగింది అని చెప్పి బీఆర్ఎస్ లో చేరి మంత్రి అయిన జూపల్లి క్రిష్ణారావు, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కేసీఆర్ హయాంలో అసలు ఏ పని జరగలేదు అని అంటున్నాడని అభివృద్ధి ఆయనకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో 14 ఏండ్లు, ఆ తర్వాత తొమ్మిదిన్నరేళ్లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, ఐదేళ్లు మంత్రిగా పాలమూరు అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేశాం..అలాంటి మమ్మల్ని రాజకీయాలు కలుషితం చేశాం అని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందని, తనకు చిన్నారెడ్డి ఆదర్శం అని రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు ..మరి చిన్నారెడ్డికి ఏఐసీసీ ఇచ్చిన టికెట్ అమ్ముకున్నారని చిన్నారెడ్డే చెప్పారని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎన్నేళ్లయింది ? డీసీసీ కార్యాలయాన్ని జూపల్లి క్రిష్ణారావు తగులబెట్టింది వాస్తవం కాదా ? వనపర్తి సభలో రూ.500 సిలిండర్ వస్తుందా ? అని రేవంత్ అడిగితే రావడం లేదని సభలోనే మహిళలు చేతులు ఎత్తి చెప్పారు. ఒక్క వనపర్తి నియోజకవర్గంలోనే 15,185 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందని అన్నారు. కొన్నాళ్లక్రితం జిల్లాల ఏర్పాటుకు హేతుబద్దత లేదు అని, ఒక్క నియోజకవర్గంతో జిల్లాను ఏర్పాటు చేస్తారా ? అని వనపర్తి జిల్లాను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఎగతాళిగా మాట్లాడాడు ..నిన్న వనపర్తి వెళ్లిన రేవంత్ రెడ్డి పశ్చాత్తాపం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ను ఒప్పించి రూ.50 కోట్ల రామన్నగట్టు రిజర్వాయర్ ను సాధించుకున్నాం ..దానికి శంకుస్థాపన కూడా జరిగింది .. ఇప్పుడు ఈ ప్రభుత్వం దానికి మళ్లీ జీఓ విడుదల చేసిందని, డాక్టర్ బాలకిష్టయ్య వనపర్తికి విశేష సేవలు అందించారు ..మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి అక్కడి క్రీడా ప్రాంగణానికి ఆయన పేరు పెట్టడం జరిగింది ..ఆయన ఆసుపత్రి సమీపంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయించారు ..తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ బాలకిష్టయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని అభివృద్ధి పునాదులు వేసింది మేమే ..పనులు చేసింది మేమే .. మీరు కొత్తగా పేరు తెచ్చుకోవాలి అనుకుంటే పనులు చేసి చూయించండని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తుందని, తెలంగాణ అభివృద్ధి ఆకాంక్షతో పనిచేశాం ..అదే ఆలోచనతో పనిచేస్తామని నిరంజన్ రెడ్డి అన్నారు.
……………………………………….