* ఫోన్ ట్యాపింగ్ కేసులో గులాబీ బాస్‌కు బిగుస్తున్న ఉచ్చు
* నిందితులందరి నోటా కేసీఆర్ మాటే
* ఆయనకు సమాచారం అందించేవారమని వెల్లడి
* ఎటు తిరిగేనో కేసు
* కేటీఆర్ ప్రస్తావన లేదు కానీ..?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : దర్యాప్తు కొనసాగేకొద్దీ.. మాజీ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ఆ కేసులో కీలక నిందితులు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీ తిరుపతన్న ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలాలను పరిశీలిస్తే.. కేసీఆర్ ఆదేశాలతోనే ట్యాపింగ్ జరిగినట్లు స్పష్టం అవుతోంది. లిక్కర్ కేసు నుంచి బిడ్డను తప్పించేందుకు, మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు పోలీసులను పావుగా ఉపయోగించుకున్నారని రాధాకిషన్ రావు, తిరుపతన్న వెల్లడించిన వివరాల ఆధారంగా తెలుస్తోంది. ఈక్రమంలో కేసు ఎటువైపు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితులను విచారణ చేసే కొద్దీ ఎన్నెన్నో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందని కేసీఆర్ నాడు ఆరోపించారు. అయితే, వాస్తవానికి బీజేపీ పైలెట్ రోహిత్ రెడ్డితో మాత్రమే సంప్రదింపులు జరిపినట్లు రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసి కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పించడానికి కేసీఆరే మరో ముగ్గురిని రంగంలోకి దింపినట్లు తెలిపారు. ఆ కేసును ఉపయోగించుకుని కేంద్రంతో బేరసారాలు ఆడి కవితను లిక్కర్ కేసు తప్పించాలనేది కేసీఆర్ ప్లాన్. బీజేపీని ఇరుకున పెట్టే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టంలేని కేసీఆర్.. ఎమ్మెల్యేతోపాటు బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయాలని సూచించినట్లు రాధాకిషన్ తెలిపారు. ఆ పనిని ప్రణీత్ రావుకు అప్పగించారు. వారి ఫోన్లు ట్యాప్ చేయడంతోపాటు కొన్ని ఆడియో క్లిప్‌లను సేకరించి పంపాడతడు. అవే ఆడియో క్లిప్‌లను సీఎం కేసీఆర్‌కు ఇచ్చాము. తమకు అనుకూలంగా పనిచేయాలంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని సూచించిన నాటి సీఎం కేసీఆర్, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నాయకుల చుట్టూ ఉచ్చు బిగించాలని పథకం వేశారు. ఇందులో భాగంగానే వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను తెరపైకి తెచ్చారు. వీరి వ్యవహారం రికార్డ్ చేసేందుకు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్సై శ్రీకాంత్‌ను ఢిల్లీ పంపి కెమెరాలను తెప్పించి, సమావేశానికి ఒకరోజు ముందు ఫామ్ హౌస్‌లో బిగించినట్లు రాధాకిషన్ రావు వివరించారు.
కేసీఆర్ కోసమే పని చేసిన టాస్క్ ఫోర్స్ టీమ్‌లు..
బీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థను కేసీఆర్ తన, పార్టీ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకున్నారని నిందితులు వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు అహర్నిశలూ కృషి చేసినట్టు రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో చెప్పారు. బీఆర్ ఎ స్ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలనే లక్ష్యంతో ఆ టీమ్‌లు పనిచేసేవి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంతో ప్రత్యర్థి పార్టీల నాయకులకు ఆర్థికంగా అండగా నిలిచిన వ్యాపారులను గుర్తించి వారిని ఆర్థికంగా దెబ్బతీసేవారు. అలాగే.. బీఆర్ఎస్ గెలుపును అడ్డుకునేవారు, పార్టీ మనుగడకు ఇబ్బందికరంగా మారిన కొంతమంది ప్రముఖులతో పాటు, పార్టీలోనే ఉన్నా అసంతృప్తితో రగిలిపోతున్న అనుమానితుల ఫోన్లూ ట్యాప్ చేసి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేసీఆర్ కు చేరవేశామని రాధాకిషన్‌రావు పోలీసులకు వెల్లడించారు.
అడిషనల్ ఎస్పీ తిరుపతన్నదే ఆ పనంతా..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతన్న వాంగ్మూలాన్ని సైతం పోలీసులు బహిర్గతం చేశారు. దాన్నిబట్టి నాటి అధికార పార్టీ ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీసే బాధ్యత తిరుపతన్న తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. బీఆర్ ఎస్ ప్రత్యర్థులపై దాడులు, నిఘా సమాచారం షేర్ చేసుకునేందుకు ‘పీఓఎల్- 2023’ పేరుతో ప్రత్యేక ఎలక్షన్ వాట్సాప్ గ్రూపును తిరుపతన్న ఏర్పాటు చేశారు. ప్రణీత్‌రావు, ఒక్కోసారి ఎస్ఓటీ పోలీసులు ఇచ్చిన సమాచారంతో విపక్ష నేతలు, వారికి సపోర్టుగా ఉండేవారిపై తిరుపతన్న మెరుపు దాడులు చేసేవారు. బీఆర్ ఎస్ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో, కామారెడ్డిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకొని, ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్రెడ్డిపై నిఘా పెట్టినట్లు తెలిపారు. మొత్తం 300 మంది సెల్ ఫోన్లు, ట్యాప్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో, తన దగ్గర ఉన్న 3 కంప్యూటర్లతో పాటు 9 లాగర్స్‌లో ఉన్న డేటా మొత్తం ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే దశాబ్దాల తరబడి సేకరించిన మావోయిస్టుల సమాచారం సైతం ధ్వంసం అయినట్లు తిరుపతన్న తెలిపారు.
కేటీఆర్ ప్రస్తావన లేదు కానీ..
బీఆర్ ఎస్ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన కొందరు అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉంచడానికి కావాల్సిన సమాచారం కోసమే ఈ తంతు నడిపించారు. ఈ నేపథ్యంలో వారు ఎవరు.. ఎప్పటి నుంచి వీరితో ట్యాపింగ్ చేయిస్తున్నారు.. అనే వివరాలను పోలీసులు విడతలవారీగా బహిర్గతం చేస్తున్నారు. ఆ వివరాల్లో కేసీఆర్ ప్రముఖంగా వినిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ సూత్రధారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. అవును అన్నట్లుగానే నిందితులు చెప్పిన నేరాంగీకార వాంగ్మూలంలో తెలుస్తోంది. అయితే.., వాటిలో ఎక్కడా కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రస్తావన ఉన్నట్లు లేదు. కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కూడా జైలుకు వెళ్లకతప్పదని కాంగ్రెస్ నేతలు చాలా సందర్భాల్లో వెల్లడించారు. మరి ఈ నేపథ్యంలో ఈ కేసులో కేసీఆర్ ఒక్కరే ఇరుక్కుంటారా.., కేటీఆర్ మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉందా అనేది.. ఆసక్తిగా మారింది.
—————————