
* నేడు కమిషన్ ముందుకు గులాబీ బాస్
* ఏం చెప్పనున్నారోనని సర్వత్రా ఉత్కంఠ
* ఇన్ కెమెరా విచారణకు చాన్స్
* చలో బీఆర్కే భవన్.. పిలుపునిచ్చిన బీఆర్ఎస్
* గులాబీ బాస్‌కు అండగా కదలనున్న దండు
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : కాళేశ్వరంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ.. నేడు రసకందాయంలో పడింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ చీఫ్ కేసీఆర్ బుధవారం జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ముందుకు విచారణకు హాజరుకానున్నారు. విచారణలో కేసీఆర్ ఏం చెప్పనున్నారనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటి వరకు 17 మందిని విచారించిన కమిషన్ తదుపరి కేసీఆర్‌ను విచారించనుంది. అప్పటి ప్రభుత్వంలో మంత్రులుగా భాగస్వాములైన ఈటల రాజేందర్ , హరీష్ రావుల విచారణ పూర్తయింది. విచారణకు ముందు పలుమార్లు కేసీఆర్ తో భేటీ అయిన హరీశ్‌రావు, విచారణ జరిగిన వెంటనే కూడా ఆయన వద్దకే వెళ్లారు. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌లో దాదాపు నాలుగు గంటల పాటు ఉన్నారు. వారి మధ్య పలు అంశాలపై చర్చలు జరిగాయి. విచారణలో ఏం అడిగారు? ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై ఏం చెప్పావు? అని హరీశ్‌ను కేసీఆర్ అడిగినట్లు సమాచారం.
సిద్ధంగా ఉన్న గులాబీ బాస్
ఇప్పటికే విచారణ కమిటీ ముందు హాజరైన కీలక వ్యక్తులతో కేసీఆర్ మాట్లాడారు. కమిటీ వేసిన ప్రశ్నలను, వారు చెప్పిన సమాధానాలను తెలుసుకున్నారు. వారి వారి ప్రశ్నలను బేరీజు వేసుకున్నట్లు తెలిసింది. కమిషన్ తనకు దాదాపు 20 పశ్నలు వేసినట్లు చెప్పిన హరీశ్ రావు.. వాటికి ఆయన చెప్పిన సమాధానాలు, కమిటీకి ఇచ్చిన ఆధారాల గురించి కూడా పేర్కొన్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్.. హరీశ్ ను అడిగిన ప్రశ్నలను బట్టి, తనపై సంధించే ప్రశ్నల గురించి ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. కమిషన్ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలో నిపుణులతోనూ కేసీఆర్ చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రశ్నల్లో తికమకలు, ప్రశ్నల స్థాయి గురించి గతంలో విచారణకు హాజరైన వారిని లోతుగా అడిగి తెలుసుకున్న కేసీఆర్.. తాను ఏం సమాధానం చెప్పాలో ఓ అంచనాకు వచ్చినట్లు బీఆర్ ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. పలువురు ఇంజనీర్లతోనూ కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. గట్టిగానే బదులిచ్చేలా కేసీఆర్ సిద్ధమైనట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
చలో బీఆర్ఎస్ భవన్
కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ బుధవారం హాజరవుతున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి భారీ కాన్వాయ్‌తో కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకోవడం, అక్కడి నుంచి బీఆర్కే భవన్ వద్దకు రావడం.. అన్నీ ప్రత్యేకంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డితో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని పార్టీ పిలుపునిచ్చింది. దాదాపుగా 500 కాన్వాయ్ తో, నాయకుల మద్దతుతో కేసీఆర్ ఉదయం 9 గంటలకు ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌజ్ నుంచి బయలుదేరనున్నారు. దారి పొడుగున ఆయనకు మద్దతు పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఉదయం 11గంటలకు కేసీఆర్ బీఆర్కే భవన్ కు చేరుకుంటారు. పలువురు చలో బీఆర్ ఎస్ భవన్ అంటూ పిలుపునిచ్చారు.
…………………………………………