
* ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటున్న విపక్షం
* దీటుగా బదులిస్తామంటున్న అధికారపక్షం
* అసలైన విపక్ష నేతను చూస్తారా?
* నేటి నుంచి తెలంగాణ సమావేశాలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
” అసెంబ్లీ సమావేశాలకు నేను కూడా వస్తున్నా”.. అని ప్రకటించి శ్రేణుల్లో జోష్ నింపారు గులాబీ బాస్. ఈ దఫా సమావేశాలకు కేసీఆర్ పూర్తిగా హాజరవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా అంతకు ముందే ప్రకటించారు. ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్.. ఇప్పటి వరకు అసెంబ్లీలో తన పాత్రను పూర్తి స్థాయిలో పోషించలేదు. దీనిపై అధికార కాంగ్రెస్ పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలో కేసీఆర్ అడుగు పెడితే ఎలా ఉంటుందో ఈసారి చూస్తారంటూ ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్ సంకేతాలు పంపుతోంది. అందుకు తగ్గట్టుగానే గులాబీ బాస్ కేసీఆర్.. నిన్న తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ ఎస్ శాసనసభాపక్ష సమావేశానికి మాస్ ఎంట్రీ ఇచ్చారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు.
ఆ తర్వాత అసెంబ్లీ ముఖం చూడని కేసీఆర్
పదేళ్ల అప్రహతిహత బీఆర్ ఎస్ అధికారానికి 2023 ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో బ్రేక్ పడింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మారారు. అయితే కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కోసం మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టారు. గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన తొలిరోజు అడుగుపెట్టి మీడియా పాయింట్ లో మట్లాడి వెళ్లిపోయారు. అయినా ఆ కొద్ది సేపట్లోనే బడ్జెట్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కానీ, ఆ తరహా అసెంబ్లీ ముఖం కూడా చూడలేదు. ఈనేపథ్యంలో కేసీఆర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీకి రాని ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ప్రధాన ప్రతిపక్ష నేత అయినప్పటికీ, ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం, చర్చల్లో పాల్గొనకపోవడాన్ని పలు సందర్భాల్లో అధికారపక్షం తీవ్రస్థాయిలో తప్పుబట్టింది.
ఔను.. నేను వస్తున్నా..
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఆరోపణలు, విమర్శలు గుప్పించినప్పుడల్లా.. మీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్ని ఆరోపణలు, విమర్శలకు జవాబు ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో ఘాటుగానే బదులిచ్చారు. అలాంటి వేళ.. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతోన్నాయి. సభకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరైతే.. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగే అవకాశముందని ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. ఔను.. నేను అసెంబ్లీకి వస్తున్నా అని స్వయంగా కేసీఆరే ప్రకటించారు. దీంతో ఈసారి అసెంబ్లీ మోతెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొట్లాడాల్సిందేనన్న కేసీఆర్
అందుకు నిన్న తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ శాసన సభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి సభకు హాజరుకావాలని సూచించిన కేసీఆర్.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలన్నారు. బీఆర్ఎస్పై ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిందలను తిప్పి కొట్టాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు, ఎండిన పంటలు, అందని కరెంటు, అందని సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరతపై అసెంబ్లీలో, మండలిలో పోరాడాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని.. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరుపై మాట్లాడాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏల పెండింగ్, పీఆర్సీ అమలుపై అసెంబ్లీ మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. మహిళలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చేందుకు కొట్లాడాలన్నారు.
సర్కారుకు చుక్కలు తప్పవట
ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. దళితబంధును నిలిపివేయడంపై ప్రశ్నించాలన్నారు. గొర్రెల పెంపకం, చేపల పంపిణీ సమగ్ర అమలు కోసం.. అసెంబ్లీ మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని సభ్యులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను, వారి ఆకాంక్షలను అర్థం చేసుకొని వారి గొంతుకగా బీఆర్ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇలాంటి నేపథ్యంలో స్వయంగా కేసీఆర్ కూడా సభకు హాజరవుతుండడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే సర్కారుకు చుక్కలు తప్పవని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఈనేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలను చూడాల్సిందే అన్న చర్చ జరుగుతోంది.
………………………………………………….