* దేశంలో 100% అక్షరాస్యత సాధించిన ఏకైక రాష్ట్రం
* ఇఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో..
* 1957లో ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం..
ఆకేరు న్యూస్, డెస్క్ :
దేశంలోనే పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయం వంటి అనేక అంశాలకు కేరళ ఇచ్చిన ప్రాధాన్యత నవశకానికి, నవోదయానికి నాంది పలికింది. ‘పాలన అనేది ప్రజల కోసం మాత్రమే కాదు, ప్రజలతో కలిసి సాగాల్సిన ప్రయాణం’ అంటారు అంబేద్కర్. ప్రజల నుంచి వచ్చిన సూచనల ఆధారంగానే ‘నవ కేరళ సృష్టి పథకం’ రూపొందింది. వాటిని అమలు చేస్తూ ఈ ఘనతను సొంతం చేసుకుంది.
కేరళ సరికొత్త రికార్డు..
కేరళ రాష్ట్రం సరికొత్త రికార్డును నెలకొల్పింది. మన దేశంలోనే తొలి పేదరిక రహిత రాష్ట్రంగా నిలిచి చరిత్రను సృష్టించింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. భారతదేశంలోనే పేదరికాన్ని నిర్మూలించిన మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ నిలిచిందని వెల్లడించారు. కేరళ. ‘ప్రజల శక్తి ముందు ఎలాంటి శక్తీ నిలవదు’-అన్న నమ్మకంతో ముందుకు సాగుతోంది. ఇదొక రాష్ట్ర ప్రయాణం కాదు, దేశం మొత్తం పాఠం నేర్చుకోవాల్సిన మార్గం. ఈ నవోదయం. ప్రజల చేతుల్లో పాలన ఉన్నన్ని రోజులూ.. ప్రజాస్వామ్యం పరిమళిస్తోందన్నారు.
అక్షరాస్యతలో వంద శాతం..
దేశంలో 100% అక్షరాస్యత సాధించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. మొదటి డిజిటల్ అక్షరాస్యత, పూర్తిగా విద్యుదీకరణ చెందిన రాష్ట్రం కేరళనే కావడం మరో విశేషం. పేదరికం నుంచి తమ ప్రజలను బయటపడేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో ప్రభుత్వం 20,648 కుటుంబాలకు రోజువారీ ఆహారాన్ని అందించింది. 2,210 మందికి వేడి భోజనం, 85,721 మందికి అవసరమైన చికిత్స, మందులు పంపిణీ చేసింది. దీంతోపాటు వేలాది మందికి ఇళ్లను నిర్మించి ఇచ్చింది. రేషన్ కార్డులు, పింఛన్లు. ఆధార్ కార్డులు అందించి.. ప్రాజెక్టుల ద్వారా ఇక్కడి ప్రజలు మెరుగైన జీవనం సాగించేందుకు బాటలు వేసింది.
ప్రపంచపటంలో ఒక మార్గదర్శిగా..
రాష్ట్రం ఏర్పడి 69 ఏళ్లు పూర్తయింది. విస్తీర్ణం పరంగా అతి చిన్నది. అయినా.. ప్రపంచవ్యాప్తంగా గుర్తించే అనేక విజయాలను సాధించింది. వామపక్ష ప్రభుత్వ ప్రజా ప్రణాళికా విధానం ఇందుకు దిక్సూచి. ఇఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వాన 1957లో ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం వేసిన పునాది ఇది. దేశంలో తొలి తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ అవతరించే ప్రక్రియపై ‘ఇది కేవలం పరిపాలనా కార్యక్రమం మాత్రమే కాదు, వేలాదిమంది ప్రజల జీవితాలతో కూడిన ప్రయాణం’ అంటారు స్థానిక స్వపరిపాలనా శాఖ ప్రత్యేక కార్యదర్శి టీవీ అనుపమ. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ఆంక్షలు, అసమానమైన ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని, నిలదొక్కుకొని కొత్త శకంలోకి అడుగులు వేస్తోంది కేరళ. ‘పేదరికాన్ని అంతం చేయడం కేవలం దాతృత్వం కాదు-అది న్యాయాన్ని సాధించడం’ అంటారు నెల్సన్ మండేలా. అలాంటి కృషిలో భాగమే నవ కేరళ ఆవిష్కరణ. భారతదేశ వృద్ధికి మార్గదర్శిగా నిలిచింది.
……………………………………..
