
* కేసు విచారణ సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం తీర్పు
ఆకేరు న్యూస్, డెస్క్ : కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాట ఘటనను సీబీఐకి బదిలీ చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తునకు ధర్మాసనం ఆదేశించింది. గత నెల 27న తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత, తమిళ నటుడు విజయ్ (Vijay) నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందారు. ఘటనపై టీవీకే (TVK)సీబీఐ దర్యాప్తు కోరింది. తమిళనాడు పోలీసుల ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగే అవకాశం లేదని టీవీకే పార్టీ తన పిటిషన్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కరూర్ (Karur) దుర్ఘటన వెనుక ఏదైనా కుట్ర కోణం ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. ఘటన అనంతరం విజయ్, ఆయన పార్టీ నేతలు పశ్చాత్తాపం చూపలేదని హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలను కూడా టీవీకే తన పిటిషన్లో ప్రస్తావించింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం న్యాయమైన, నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీతో పాటు, బీజేపీ తమిళనాడు నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నిర్ణయం ప్రకటించింది. అక్టోబర్ 10న ఈ పిటిషన్లపై వాదనలు ముగియగా, ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
……………………………………..