* గ్రేటర్లో ఎదుగుదలకు బ్రేకర్లా ఇక్కడి రాజకీయం
* ఇద్దరి లీడర్ల మధ్య వివాదం.. కార్యకర్తల్లో గందరగోళం
* సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి తెరపైకి..
* మంత్రి ముందే ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య రుసరుసలు!
* జీహెచ్ ఎంసీ ఎన్నికల ముందు పార్టీకి నష్టమే
ఆకేరు న్యూస్.. సండే పొలిటికల్ స్పెషల్ :
వాళ్లిద్దరూ అధికార పార్టీ లీడర్లు. ఒకరు ఎమ్మెల్యే అయితే.. మరొకరు కార్పొరేటర్. ఒకే నియోజకవర్గానికి చెందిన వారు. అయితే.. ఇద్దరూ పవర్ ఫుల్ లీడర్లే. ఇప్పుడు వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. తన అడ్డాలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కబ్జా చేశారని కార్పొరేటర్ అంటుంటే, తన ఇలాకాలో కార్పొరేటర్ పెత్తనం ఏంటని ఎమ్మెల్యే అంటున్నారు. ఇద్దరి లీడర్ల మధ్య పోరులో కింది కేడర్ పరేషన్ అవుతున్నారు. ఇంతకీ ఈ పోరు జరుగుతోంది ఎక్కడో తెలుసా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గంలో. అక్కడ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆ జీహెచ్ ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి. వీరి పోరు తాలూకు ప్రభావం ఒక్క నియోజకవర్గానికే పరిమితం కావడం లేదు. సిటీ కాంగ్రెస్ పై ప్రభావం చూపనుందని పార్టీలో చర్చ జరుగుతోంది.
సిటీలో కీలకం ఖైరతాబాద్
ఖైరతాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ అడ్డా. ఇక్కడ నుంచి దివంగత మాజీ మంత్రి పి.జనార్దన్ రెడ్డి అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో అతి పెద్ద నియోజకవర్గమైన ఖైరతాబాద్ నుంచి 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అదే నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994, 2004లలో కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో సహకార, యువజన సేవల మంత్రిగా, 1982లో ఆర్కైవ్స్ మంత్రిగా, 1990 నుంచి 1992 వరకు కార్మిక, ఉపాధి, గృహనిర్మాణ మంత్రిగా, 1993లో పౌర సరఫరా మంత్రిగా అనేక పదవుల్లో కొనసాగారు. 1994 – 1999 మధ్య కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నాయకుడిగా ఉన్నారు. ఎన్‌టి రామారావు, ఎన్.చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా నిలిచారు. తెలంగాణ ప్రాంతానికి న్యాయమైన నిధుల కోసం పోరాడారు. పార్టీ సమావేశానికి వెళుతుండగా 2007 డిసెంబరు 28న గుండెపోటుతో పీజీఆర్ చనిపోయారు. ఆయన బిడ్డే విజయారెడ్డి.
పీజేఆర్ బిడ్డ గట్టి పోటీ
విజయారెడ్డి తండ్రి మరణాంతరం ఆయన అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరారు. 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి 2014లో టీఆర్ఎస్లో చేరారు.
2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఖైరతాబాద్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచారు. ఆమె 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కకపోవడంతో ఆమె 2019లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచారు. విజయారెడ్డి 2022 జూన్ 18న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి జూన్ 23న కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి దానం నాగేందర్ చేతిలో ఓడిపోయారు.
దానం.. ఆషామాషీ కాదు..
కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాగేందర్ తర్వాతి కాలంలో 1994, 1999, 2004 ఎన్నికల్లో ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. నియోజకవర్గాల డీలిమిటేషన్ తరువాత, 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. 2009లో రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు. కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో అదే పోర్ట్‌ఫోలియోలో కొనసాగారు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్ర రెడ్డిపై ఓడిపోయారు. 2018, జూన్ 23న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ కంచుకోట ఖైరతాబాద్ ప్రత్యేక రాష్ట్రం అనంతరం బీఆర్ ఎస్(నాటి టీఆర్ ఎస్)కు కంచుకోటగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో గులాబీ జెండానే ఎగిరింది. దానం నాగేందర్ మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానం.. ఆ పార్టీలో చేరారు.
ఒకే గూటిలో ఆ ఇద్దరూ..
దానం చేరికను విజయారెడ్డి ససేమిరా ఒప్పుకోలేదు. అయితే.., అతడిని ఎంపీ స్థానానికి పంపి, నియోజకవర్గంలో మీకు ఢోకా లేదని అధిష్ఠానం నచ్చచెప్పడంతో అంగీకరించారు. ఎంపీ ఎన్నికల సమయంలో దానం, విజయారెడ్డి కొన్నిసార్లు కలిసి ప్రచారం చేశారు. దీంతో ఆ ఇద్దరూ ఒక్కటయ్యారని అందరూ అనుకున్నారు. దురదృష్టవశాత్తు దానం ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో విజయారెడ్డి వర్గం అయోమయంలో పడింది. ఎమ్మెల్యే దానం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని అనుచరులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం దానంపై ఫిరాయింపుల కేసు నడుస్తోంది. అనర్హత వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నిక అనివార్యమై .. ఆయన మళ్లీ కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తే విజయారెడ్డి సహకరిస్తారా అనేది ప్రశ్నార్థకం.
అక్కడ ప్రస్తుతం రెండు గ్రూపులు
ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఒక గ్రూపు ఎమ్మెల్యే వైపు నడుస్తుంటే, మరో గ్రూపు ను విజయారెడ్డిని నడిపిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో నేతలు ఎవరి వెంట తిరగాలో తెలియక తికమకపడుతున్నారు. మరోవైపు ఖైరతాబాద్‌లో విజయారెడ్డికి చెక్ పెట్టేందుకు దానం తెగ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు దానం తిరిగి గులాబీ గూటికి చేరతారని, అందుకే ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేస్తున్నారని విజయారెడ్డి గ్రూపు ప్రచారం చేస్తోంది. అదే జరిగితే, తనకు లైన్ క్లియర్ అవుతుందని విజయారెడ్డి భావిస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఉన్న తలనొప్పికి మందు రాయడం, అధిష్ఠానానికే తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలోని కాంగ్రెస్ ఫైట్ ను గులాబీ పార్టీ ఆసక్తిగా గమనిస్తోంది.
మరోసారి రగడ
హిమాయత్ డివిజన్లోని ఆదర్శ బస్తీలో శనివారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం సంద ర్భంగా దానం, విజయారెడ్డి మధ్య మరోసారి రగడ మొదలైంది. ఖైరతాబాద్ కార్పొరేటర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పి.విజయారెడ్డి ఫొటోను ప్లెక్సీపై పెట్టకపోవడంతో ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై ఆమె అసహనం వ్యక్తం చేశారు. సన్న బియ్యం పంపిణీ చేస్తున్న క్రమంలో దానం పక్కన విజయారెడ్డి నిలబడి ఉండగా ఆమెను పక్కకు వెళ్లాలి అని దానం చెప్పారు. దీంతో నీ పని చూసుకో అంటూ విజయారెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. అక్కడే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని విజయారెడ్డిని సముదాయించారు. కార్యక్రమం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లుతున్న సమయంలో విజయారెడ్డి అనుచరులు, కాంగ్రెస్ మహిళా నేతలు పొన్నం ప్రభాకర్‌తో ఈ అంశంపై మాట్లాడగా తరువాత మాట్లాడుదామని చెప్పి వెళ్లిపోయారు. ఉద్దేశ్యపూర్వకంగానే విజయారెడ్డి ఫొటో పెట్టలేదని, పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించడం లేదని ఆమె అనుచరులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారి మధ్య వైరాన్ని సముదాయించలేక అధిష్ఠానం తల పట్టుకుంటోంది. జీహెచ్ ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కీలక నియోజకవర్గంలో, కీలక నేతల మధ్య వైరం.. సిటీ కాంగ్రెస్ పై ప్రభావం చూపనుందనే చర్చ జరుగుతోంది. ఆలోగా అయినా వారి మధ్య వివాదాలు సమసిపోతాయా లేదా.. అనేది వేచి చూడాలి .
……………………………………………….
