
*అన్ని పథకాలకూ కోత పెడుతున్నాడు
* పటాన్ చెరుపై పగబట్టారు
* రాష్ట్రాన్ని ఆగం ఆగం చేస్తున్నాడు
* సైకోలా ప్రవర్తిస్తున్నాడు
* సీఎం రేవంత్ పై హరీష్ ఫైర్
ఆకేరు న్యూస్ సంగారెడ్డి ః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఎనుముల రేవంత్ కాదని కోతల రేవంత్ అని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హయాంలో అమలు చేసిన పథకాలన్నింటికీ రేవంత్ కోత విధిస్తున్నాడని హరీష్ ఆరోపించారు.సంగారెడ్డి జిల్లా రైతులకు రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో జిన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తామని ప్రకటించి పటాన్ చెరు, మేడ్చల్ రైతులకు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పటాన్ చెరు, మేడ్చెల్ రైతులపై పగ పట్టారని హరీష్ ఆరోపించారు.ఇంత వరకూ రైతులకు రుణ మాఫీ చేయలేదన్నారు. అధికారంలోకి వస్తే మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలన్నీ అమలు చేయకపోవడమే మార్పా అని హరీష్ ప్రశ్నించారు. దేవుని మీద ఒట్టేసిన రేవంత్ ప్రజలను దోఖా చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యపారం డమాల్ అంది అని హరీష్ అన్నారు. రేవంత్ చేస్తున్న తప్పులను ఎత్తి చూపినందుకే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారని హరీష్ అన్నారు. రైతు భరోసా రాని రైతులతో రింగ్ రోడ్డుపై ఉద్యమిస్తే ప్రభుత్వం గుండెలు జారిపోతాయని హరీష్ అన్నారు.రేవంత్ రెడ్డి సైకోలా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నాడని హరీష్ రావు విమర్శించారు.
……………………………………….