* నాకు ఆ నమ్మకం ఉంది : కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ ఎస్ భవన్ లో న్యూఇయర్ కేలెండర్ ఆవిష్కరణ అనంతరం కేటీఆర్ మాట్లాడారు. కేలెండర్లో సంవత్సరాలు, తేదీలు మారిపోతున్నాయని, కాంగ్రెస్ పాలన మెరుగుపడడం లేదని అన్నారు. ఎన్నో ఆశలతో ఓట్లు వేసిన ప్రజల జీవితాలు మారలేదని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్తోందన్నారు. యూరియా కోసం రైతులు చలిలో అష్టకష్టాలు పడుతున్నారని వాపోయారు. ఒక్క యూరియా బస్తా కోసం గంటల తరబడి, రైతులు క్యూలు కట్టే దుస్థితి తెలంగాణలో మళ్లీ కనిపిస్తోందన్నారు. తెలంగాణ రాకపూర్వం నాటి పరిస్థితులు మళ్లీ వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందన్నారు. మిగతా పార్టీలకు, బీఆర్ ఎస్ పార్టీలకు తేడా ఉందని, పార్టీ నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోదామన్నారు. ధర్మం, న్యాయం, నిజాయితీ మన వైపు ఉన్నాయని మనం తప్పనిసరిగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకైతే సంపూర్ణ నమ్మకం ఉందన్నారు. 2028లో మన నాయకుడు కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడడమే తమ లక్ష్యమన్నారు. రెండేళ్లుగా సాగించిన వివిధ పోరాటాల ఫలితంగా పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. మూసీలో జరుగుతున్న దాష్టీకానికి వ్యతిరేకంగా గళమెత్తిన కార్యకర్తలకు, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై పోరాడుతున్న బీఆర్ ఎస్ సైనికులకు నమస్కారాలు తెలిపారు.

