* పదవులు అనుభవించి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పారి పోతున్నారు
* మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఆస్కార్ నటుల కంటే ఎక్కువగా నటించారు
* రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు మరచి పోయి ఆరు గ్యారడీలు మొదలైనాయి.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫైర్
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : సొంత ప్రయోజనాల కోసమే బీఆర్ ఎస్ నేతలు పార్టీ మారుతున్నారు. పదవులన్నీ అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోతున్నారని బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ చేవెళ్ళ సభలో పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు ఆస్కార్ నటుల మించి కాంగ్రెస్ పార్టీని విమర్శించారన్నారు. మంత్రిగా అవకాశమిస్తే మహేందర్ రెడ్డి పార్టీకి ప్రజలకు సహకరించేదేమి లేదన్నారు. రంజిత్ రెడ్డి ఒక అడుగుముందుకేసీ ఏకంగా తన వల్లే పరిశ్రమలు వచ్చాయని చెప్పుకుంటున్నారని ఆయన మండిపడ్డాడు. రంజిత్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎంపీగా గెలపిస్తే నమ్మించి మోసం చేశారన్నారు. మహెందర్ రెడ్డి, రంజిత్ రావులు మళ్ళీ వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా .. పార్టీలోకి రానిచ్చేది లేనేలేదన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ కష్ట కాలంలో నేనున్నానంటూ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడన్నారు. బడుగు , బలహీన వర్గాల కోసం జీవతమంతా పోరాటం చేసిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ . ఆయనను గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేశవరావు, కడియం శ్రీహరిలు పార్టీలో ఉన్నప్పుడు ఎన్నో పదవులు అనుభవించి పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీ వదిలి పారిపోతున్నారన్నారు. పోతూ పోతూ పార్టీ మీద రాళ్ళు వేసి పోతున్నారన్నారు. వాళ్ళు వయసులో పెద్ద వాళ్ళు వాళ్ళను నేనేమి అనదలచుకోలేదు. వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.
* ముఖ్యమంత్రివా .. బోటికొట్టేటాయనవా.?
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన భాష మార్చుకోవడం లేదు. ఆయన మాట్లాడే మా టలు రోత పుట్టిస్తున్నాయన్నారు. కేసీఆర్ ను వంద మీటర్ల లోతు బొంద పెడుతా నంటున్నాడు.. నా కొడకల్లారా… చీరేస్తా.. మెడలో పేగులేసుకుంటా అంటాడు.. ముఖ్యమంత్రి ఎక్కడైనా మెడలో పేగులేసుకుని తిరుగుతారా..? అసలు ముఖ్యమంత్రివా లేక బోటి కొట్టేటాయనవా అని .. కేటీఆర్ ఎద్దేవా చేశారు. మల్కాజిగిరి సిట్టింగ్ సీటు గెలవలేవు.. రాష్ట్ర మంతా గెలుస్తా అంటున్నాడు. బీఆర్ ఎస్ ఒక్క సీటైనా గెలిచే దమ్ముందా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే.. నేను మల్కాజిగిరిలో నేను పోటీ చేయడానికి సిద్దం .. రేవంత్ రెడ్డి సిద్దమా అని ప్రశ్నిస్తే మాత్రం జవాబు లేదని కేటీఆర్ అన్నారు. జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నానని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. జేబులో ఎవరు కత్తెర పెట్టుకుని తిరుగతరో చెప్పండని సభికుల నవ్వుల మద్య అడిగాడు. అసలు రేవంత్ రెడ్డి ఇప్పటికీ ముఖ్యమంత్రి లాగా భావించడం లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడి లాగనే మాట్లాడుతున్నాడన్నారు. ఫోన్ ట్యాపింగ్ , గొర్రెల స్కామ్ అంటూ రోజుకో స్కాం పేరుతో లీకులు ఇచ్చి లీకు వీరుడి లాగా రేవంత్ రెడ్డి మారాడని కేటీఆర్ విమర్శించారు. స్కాంల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికల హామీలను ప్రశ్నించకుండా రోజుకో లీకు పేరుతో ప్రజలను మాయ చేస్తున్నాడు. ప్రజలు రైతు బంద్ అడుగొద్దు , కరెంట్ ఏమైందని అడగొద్దనే ఈ స్కాంల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. ఆరు గ్యారంటీలు పోయి ఇపుడు ఆరు గారడీలు మొదలైనాయని కేటీఆర్ విమర్శించారు. 100 రోజుల పాలనలోనే 36 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నడు.. నోటి ఫికేషన్లు ఇవ్వకుండా అన్ని వేల ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని మేము కూల గొట్టేది లేదు. ఐదేండ్లు నిక్షేపంగా ఉండండి.. మేము కూల్చాల్సిన అవసరం లేదు.. మీ ప్రభుత్వానికి ముప్పు మీ పార్టీ నాయకుల నుంచే ఉంటుందన్నారు. లోక్ సభ ఎన్నికలయిన తర్వాత బీజేపీలకు వెళ్ళే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డేనని కేటీఆర్ అన్నారు.
—————————–