*6 గ్యారంటీలకు ‘లీగల్’ టచ్ ఇవ్వాలంటూ కేటీఆర్ డిమాండ్.
*ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే చట్టం చేయాల్సిందే.. స్పీకర్ కార్యాలయంలో కేటీఆర్ బృందం!
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన ‘6 గ్యారంటీలను’ పక్కాగా అమలు చేయడమే లక్ష్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కీలక అడుగు వేసింది. ఈ ఆరు హామీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) సోమవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ‘ప్రైవేట్ మెంబర్ బిల్లు’ నోటీసును అందజేశారు.
*స్పీకర్ కార్యాలయంలో హడావుడి
కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి, ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలను వివరించారు. స్పీకర్‌తో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా అధికారికంగా నోటీసులు అందజేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
*చట్టబద్ధత ఎందుకు? కేటీఆర్ వాదన…
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చే హామీలు కేవలం మాటలకే పరిమితం కాకూడదని, వాటికి చట్టబద్ధమైన రక్షణ ఉంటేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.
“ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కలుగుతుంది. దీనివల్ల ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ పథకాలను ఆపడం సాధ్యం కాదు.”
“బడ్జెట్ కేటాయింపులు, అమలు తీరులో పారదర్శకత రావాలంటే ఈ బిల్లు అత్యంత కీలకం.” అని ఆయన పేర్కొన్నారు.
*ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహం….
సాధారణంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులే సభలో చర్చకు వస్తుంటాయి. కానీ, ప్రతిపక్షం నుంచి ‘ప్రైవేట్ మెంబర్ బిల్లు’ రావడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసే వ్యూహాన్ని బీఆర్ఎస్ అమలు చేస్తోంది. ఈ బిల్లును స్పీకర్ అనుమతిస్తారా? లేదా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
