KCR Land Allegations | KTR VS Revanth Reddy
* కేసీఆర్‌కు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి
* ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?
* అసెంబ్లీ పవిత్రతను రేవంత్ దెబ్బతీస్తున్నారు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉందని ఇన్నాళ్లు వెయ్యిసార్లు తప్పుడు ప్రచారం చేశారని, నిన్న అసెంబ్లీలో స్వయంగా సీఎం కేసీఆర్‌కు 67 ఎకరాల భూమి మాత్రమే ఉందని చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లోనే తన భూమి వివరాలు స్పష్టంగా చూపించారని, మీలాగా కేసీఆర్ ఎవరి భూములు గుంజుకోలేదని మండిపడ్డారు. వెయ్యి ఎకరాలంటూ నిరాధార ఆరోపణలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
*సీఎం బండారం బయటపడుతుంది..
చింతమడకలో కేసీఆర్ పుట్టినప్పుడు తమది రెండెకరాల ఇల్లేనని, తమ నానమ్మ ఊరు కోనాపూర్‌లోని వందల ఎకరాల భూమి మానేరు డ్యామ్‌లో మునిగిపోయిందని కేటీఆర్ స్పష్టం చేశారు. కొండారెడ్డిపల్లికి వెళ్తే సీఎం రేవంత్ బండారం బయటపడుతుందని ఎద్దేవా చేశారు. గోడలపై రాతలు రాసుకునే స్థాయి నుంచి వచ్చిన మీకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. గత 57 ఏళ్ల నుంచి తమ కుటుంబ ఆస్తులు, అలాగే 72 ఏళ్ల నుంచి కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
*అసెంబ్లీ పవిత్రతను దెబ్బతీస్తున్నడు రేవంత్..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ పవిత్రతను పూర్తిగా దెబ్బతీస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సభలో పచ్చి అవాస్తవాలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వెయ్యి రోజుల విఫల పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన సోదరుడికి అక్రమంగా భూములు కట్టబెట్టారని, తన కుటుంబం చేసిన భూ దోపిడీ బయటకు రాకుండా ఉండేందుకే ఇలాంటి కుట్రలకు తెరలేపారని విమర్శించారు. కమీషన్లు దండుకోవడానికే ’22ఏ’ నిబంధన తెచ్చారని దుయ్యబట్టారు.
*ప్రతి పథకం వెనుక ఒక స్కామ్..
అన్ని రంగాలలో సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్ అయ్యారని, పెద్ద పదవిలోకి వచ్చినా ఆయన బుద్ధి మాత్రం మారలేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ తమ్ముళ్లు ఏరోస్పేస్ కంపెనీలు ఎలా పెట్టారని నిలదీశారు. రాష్ట్రంలో రేవంత్ ప్రతి పథకం వెనుక ఒక భారీ స్కామ్ దాగి ఉందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
